PM Modi: 'ఆందోళన అవసరం లేదు.. మీ వెంటే నేనున్నా'.. కొత్త ఎంపీలతో మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల ఎన్డీఏలో చేరిన ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశారు. శుక్రవారం పార్లమెంట్ సమావేశాలకు ముందు ఏర్పాటు చేసిన అల్పాహార సమావేశంలో సుమారు గంటపాటు 45 మంది ఎంపీలతో ఆయన చర్చించారు శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) నుంచి ఏక్‌నాథ్ శిందే శిబిరంలో చేరిన వారు, అలాగే తృణమూల్ కాంగ్రెస్ నుంచి వచ్చిన రెబెల్ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడిన మోదీ.. కొత్త రాజకీయ వేదికలో ఉన్నామని ఎలాంటి ఆందోళన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఎన్డీఏ ఒక కుటుంబమని, ఇందులోని ప్రతి ఒక్కరికీ సమాన గౌరవం, రాజకీయంగా ఎదిగే అవకాశం ఉంటుందని ప్రధాని స్పష్టం చేశారు. కూటమిలోని ప్రతి ఎంపీకి తన పూర్తి మద్దతు ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
వివరాలు
ప్రతిపక్ష సభ్యులతో కూడా సత్సంబంధాలు
రాష్ట్రాల అభివృద్ధే దేశ ప్రగతికి బాట వేస్తుందని పేర్కొన్న మోదీ.. ఎంపీలు తమ నియోజకవర్గాలు, రాష్ట్రాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ఏ అంశమైనా నేరుగా ప్రధానమంత్రి కార్యాలయాన్ని (పీఎంఓ) సంప్రదించవచ్చని తెలిపారు.
ప్రజలకు, ముఖ్యంగా యువతకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎంపీలకు సూచించారు.
పార్లమెంట్‌ను ప్రజాస్వామ్యానికి సర్వోన్నత దేవాలయంగా అభివర్ణించిన ప్రధాని.. దాని చరిత్ర, సంప్రదాయాలను తెలుసుకోవాలని కోరారు.
లోక్‌సభ చర్చల్లో చురుకుగా పాల్గొనడంతో పాటు ప్రతిపక్ష సభ్యులతో కూడా సత్సంబంధాలు కొనసాగించాలని సూచించారు.
వివరాలు
అమ్మ ఎలా ఉన్నారు..?
సమావేశానికి హాజరైన ప్రతి ఎంపీని వ్యక్తిగతంగా పలకరించిన ప్రధాని మోదీ.. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సునేత్రా పవార్ ఆరోగ్యం గురించి ఆమె కుమారుడు, ఎంపీ పార్థ్ పవార్‌ను ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు.
ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలని కూడా సూచించారు. పార్థ్ పవార్ తండ్రి, మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఈ ఏడాది జనవరిలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు.
అనంతరం ఆయన స్థానంలో సతీమణి సునేత్రా పవార్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.