Meenakshi Natarajan: నా కోసం ఎవరూ రాజీనామా చేయొద్దు.. తెలంగాణ సీటుపై మీనాక్షి స్పష్టత
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తన రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ అంశంపై స్పందిస్తూ బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై ఎలాంటి న్యాయపరమైన కేసులు లేవని స్పష్టం చేసిన ఆమె, బీజేపీ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. ఇటీవల మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ స్థానానికి మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఒక కేసుకు సంబంధించిన వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొనలేదనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడైంది. అయితే ఈ వ్యవహారంపై స్పందించిన మీనాక్షి, బీజేపీతో పాటు ఎన్నికల సంఘం కూడా కుమ్మక్కై తన నామినేషన్‌ను తిరస్కరించిందని ఆరోపించారు. నా రాజ్యసభ సీటును చోరీ చేశారు.
వివరాలు
నేను మధ్యప్రదేశ్ నుంచే పోటీ చేస్తా
బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజలకు తెలియజేయడానికే మేము పోరాటం చేస్తున్నాం. నా కోసం మరొకరితో రాజీనామా చేయించి తెలంగాణ నుంచి రాజ్యసభ సీటు తీసుకోవాలనే ఆలోచన నాకు లేదు. నేను మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తిని కాబట్టి అక్కడి నుంచే రాజ్యసభకు వెళ్లాలని కోరుకుంటానని ఆమె స్పష్టం చేశారు. అదే సమయంలో, తన కేసులకు సంబంధించిన సమాచారాన్ని కాంగ్రెస్ నాయకులే అందించారన్న ప్రచారాన్ని కూడా ఆమె ఖండించారు. అది పూర్తిగా అవాస్తవమని పేర్కొంటూ, బీజేపీ ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారాలు చేస్తోందని ఆరోపించారు. ఒక కేసు ఉందనే కారణంతోనే నామినేషన్ తిరస్కరించబడలేదు. అయితే నామినేషన్ ప్రక్రియ జరుగుతున్న గదిలోకి బీజేపీ నాయకులను ఎందుకు అనుమతించారు? దీనిపై సమాధానం చెప్పాలంటూ మీనాక్షి నటరాజన్ ప్రశ్నించారు.