Revanth Reddy: రేవంత్‌రెడ్డి అమెరికా టూర్‌కు నో.. కేంద్రంపై ఐఓసీ తీవ్ర అసంతృప్తి!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (ఐఓసీ) అమెరికా విభాగం అసంతృప్తి వ్యక్తం చేసింది. గుజరాత్ ముఖ్యమంత్రికి అమెరికా పర్యటనకు అనుమతి ఇచ్చి.. తెలంగాణ ముఖ్యమంత్రికి నిరాకరించడం కేంద్రం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆరోపించింది. రాష్ట్రాల అభివృద్ధి, విద్య, పెట్టుబడులు, ఆవిష్కరణలకు సంబంధించిన కార్యక్రమాలను రాజకీయ కోణంలో చూడటం సరికాదని ఐఓసీ పేర్కొంది. యువతకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు చేపట్టే ప్రయత్నాలకు కేంద్రం మద్దతు ఇవ్వాలని కోరింది. తెలంగాణ అభివృద్ధికి విదేశీ సంస్థలతో భాగస్వామ్యాలు కీలకమని తెలిపింది.
వివరాలు
విదేశాంగ శాఖ అనుమతి ఇవ్వకపోవడంతో పర్యటన రద్దు
రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి రాకపోవడం వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు, విద్యా భాగస్వామ్యాల పరంగా లభించే అవకాశాలపై ప్రభావం పడే అవకాశం ఉందని ఐఓసీ ఆందోళన వ్యక్తం చేసింది.
సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర విదేశాంగ శాఖ అనుమతి ఇవ్వకపోవడంతో ఆయన పర్యటన రద్దయింది.
అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయం, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ), నార్త్‌ఈస్టర్న్ విశ్వవిద్యాలయం, వర్జీనియా టెక్ ప్రతినిధులతో రేవంత్‌రెడ్డి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.
అయితే ప్రతిపాదిత కార్యక్రమాలు ముఖ్యమంత్రి హోదాకు, పర్యటన ఉద్దేశానికి తగిన స్థాయిలో లేవని విదేశాంగ శాఖ పేర్కొన్నట్లు సమాచారం.
దీంతో సీఎం పర్యటన రద్దయింది. అయినప్పటికీ తెలంగాణ అధికారుల బృందం అమెరికాలో ముందుగానే ఖరారైన కార్యక్రమాల్లో పాల్గొననుంది.