Supreme Court: బీమా లేకుంటే.. పెట్రోల్ లేదు.. రోడ్డు ప్రమాదాల నివారణకు సుప్రీంకోర్టు కొత్త ప్రతిపాదన
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, బీమా లేకుండా తిరుగుతున్న వాహనాల సంఖ్యపై ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు కీలక ప్రతిపాదన చేసింది. చెల్లుబాటు అయ్యే వాహన బీమా (ఇన్సూరెన్స్) లేని వాహనాలకు పెట్రోల్ బంక్‌లలో ఇంధనం ఇవ్వకుండా చేసే విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించింది. ఈ మేరకు మంగళవారం (ఆగస్టు 4) విచారణ సందర్భంగా బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (IRDAI), కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) కలిసి కార్యాచరణ రూపొందించాలని ఆదేశించింది.
వివరాలు
ప్రతి వాహనానికి థర్డ్ పార్టీ బీమా తప్పనిసరి
జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టింది.
దేశంలో అమల్లో ఉన్న మోటారు వాహనాల చట్టం ప్రకారం ప్రతి వాహనానికి థర్డ్ పార్టీ బీమా తప్పనిసరి అయినప్పటికీ, భారీ సంఖ్యలో వాహనాలు ఇప్పటికీ బీమా లేకుండానే రోడ్లపై తిరుగుతున్నాయని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
సుప్రీంకోర్టు ప్రస్తావించిన వివరాల ప్రకారం దేశంలోని సుమారు 30.48 కోట్ల వాహనాల్లో దాదాపు 16.54 కోట్ల వాహనాలకు చెల్లుబాటు అయ్యే బీమా లేదు.
అంటే దాదాపు 56 శాతం వాహనాలు ఇన్సూరెన్స్ లేకుండానే ప్రయాణిస్తున్నాయి.
ఇదే సమయంలో 2024లో దేశవ్యాప్తంగా 4,87,705 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయని అధికారిక గణాంకాలను కోర్టు ప్రస్తావించింది.
వివరాలు
బీమాను పునరుద్ధరించే వరకు పెట్రోల్ బంక్‌లో ఇంధనం ఇవ్వద్దు
రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు థర్డ్ పార్టీ బీమా ద్వారా తగిన పరిహారం అందేలా చూడాలంటే తప్పనిసరి బీమా నిబంధనలను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ధర్మాసనం పేర్కొంది.
ఈ నేపథ్యంలో వాహన బీమా చెల్లుబాటు స్థితిని ఇంధన సరఫరాతో అనుసంధానం చేసే పైలట్ ప్రాజెక్టును రూపొందించాలని IRDAI, MoRTHలను ఆదేశించింది.
కోర్టు సూచించిన విధానం ప్రకారం, వాహనానికి చెల్లుబాటు అయ్యే బీమా లేకుంటే సంబంధిత యజమాని బీమాను పునరుద్ధరించే వరకు పెట్రోల్ బంక్‌లో ఇంధనం ఇవ్వకుండా నిలిపివేయవచ్చు.
ఈ విధానం అమల్లోకి వస్తే బీమా లేని లేదా నమోదు కాని వాహనాలను సులభంగా గుర్తించడమే కాకుండా, వాహన యజమానులు తమ బీమాను సకాలంలో రెన్యువల్ చేసుకునేలా ప్రోత్సాహం లభిస్తుందని కోర్టు అభిప్రాయపడింది.
వివరాలు
మరింత సమర్థంగా సెక్షన్ 146 అమలు చేయండి
అదేవిధంగా మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 146 అమలును మరింత సమర్థంగా అమలు చేయడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని పేర్కొంది.
ఈ సెక్షన్ ప్రకారం ప్రతి వాహనానికి థర్డ్ పార్టీ బీమా తప్పనిసరి. ఈ వ్యవస్థను అమలు చేయడానికి జాతీయ రహదారులు, ప్రధాన రోడ్లపై ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) కెమెరాలను ఉపయోగించాలని కూడా సుప్రీంకోర్టు సూచించింది.
వివరాలు
అభ్యంతరం వ్యక్తం చేయని కేంద్ర పెట్రోలియం,సహజ వాయువు మంత్రిత్వ శాఖ
ఈ కెమెరాలను ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (IIB) డేటాబేస్‌తో పాటు వాహన్ (VAHAN) పోర్టల్‌తో అనుసంధానం చేస్తే వాహన బీమా వివరాలను వెంటనే గుర్తించే అవకాశం ఉంటుందని తెలిపింది.
అలాగే ఈ ప్రతిపాదనపై కేంద్ర పెట్రోలియం,సహజ వాయువు మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని కూడా సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది.
ఈ కేసు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ దాఖలు చేసిన అప్పీల్ విచారణ సందర్భంగా ఈ కీలక సూచనలు వెలువడ్డాయి.