
Pitabas Panda: బరంపురంలో బీజేపీ నేత పీతాబాస్ పాండా దారుణ హత్య
ఈ వార్తాకథనం ఏంటి
ఒడిశా రాష్ట్రంలోని బరంపురం ప్రాంతంలో బీజేపీ నేత, సీనియర్ న్యాయవాది పీతాబాస్ పాండాను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా కాల్చి చంపారు. ఈ సంఘటన రాత్రి 10గంటల సమయంలో బైకుంఠనగర్‌లోని తన నివాసానికి చేరుకునే సమయంలో చోటు చేసుకుంది. ఒక కార్యక్రమం ముగించి ఇంటికి తిరిగి వస్తుండగా పాండా ఇంటి సమీపంలో,మాటువేసిన ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి పాండాను అడ్డగించారు. అత్యంత సమీపం నుంచి ఆయనపై రెండు రౌండ్లు కాల్పులు జరిపి,అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో పాండా చాతీలోకి బుల్లెట్లు దూసుకెళ్లడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. స్థానికులు వెంటనే స్పందించి, తీవ్రంగా గాయపడిన ఆయనను సమీపంలోని ఎంకేసీజీ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. యితే, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
వివరాలు
బరంపురంలో ఆయన ప్రసిద్ధ న్యాయవాది
పాండా హత్య వార్త ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. బరంపురంలో ఆయన ప్రసిద్ధ న్యాయవాది, స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యుడిగా మంచి గుర్తింపు పొందారు. రాజకీయంగా చూస్తే, పాండా గతంలో కాంగ్రెస్ పార్టీతో పనిచేశారు. 2024 సాధారణ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి, తక్కువ కాలంలోనే పార్టీని ప్రముఖ స్థాయికి తీసుకుని వెళ్లి కీలక నేతగా ఎదిగారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల అవినీతిపై ఆయన గట్టిగా గళం విప్పినట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి.
వివరాలు
రేపు రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదుల విధుల బహిష్కరణ
ఈ ఘటనపై సమాచారం అందుకున్న సౌత్ రేంజ్ ఇన్స్పెక్టరేట్ ఆఫీసర్ (IG) నీతి శేఖర్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని, ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్యకు కారణాలు ఇంకా తెలియని పరిస్థితే ఉన్నప్పటికీ, అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సంఘటనపై రాష్ట్ర మంత్రి బిభూ భూషణ్ జెనా, బరంపురం ఎమ్మెల్యే కె. అనిల్ కుమార్ ఆసుపత్రికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తూ అఖిల ఒడిశా న్యాయవాదుల సంఘం నిరసనకు పిలుపునిచ్చింది. రేపు (8న)రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులందరూ విధులకు దూరంగా ఉండాలని కోరింది.