Draupadi Murmu: వన్ నేషన్-వన్ ఎలక్షన్ దేశానికి మేలు చేస్తుంది: రాష్ట్రపతి
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
ఈ బిల్లు కోసం ప్రత్యేకంగా జాయింట్ పార్లమెంటరీ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రతిపక్షం ఈ బిల్లును రాజ్యాంగ విరుద్ధంగా అభివర్ణిస్తుండగా, కేంద్రం మాత్రం జమిలి ఎన్నికల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొంటోంది.
ఈ తరుణంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వన్ నేషన్-వన్ ఎలక్షన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇది సుపరిపాలనకు కొత్త నిర్వచనాన్ని ఇస్తుందని, దేశానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు.
పాలనలో సుస్థిరతను అందించడంతో పాటు విధానాల్లో అనిశ్చితిని తొలగించడానికి, వనరుల వినియోగాన్ని సమర్థవంతంగా చేయడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు.
Details
జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ద్రౌపది ముర్ము
76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రాష్ట్రపతి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
గత 75 ఏళ్లలో దేశం సాధించిన పురోగతిని ప్రస్తావిస్తూ, సుసంపన్న, సమ్మిళిత భారత్‌ను సాకారం చేసేందుకు ప్రతి పౌరుడు పునరంకితమవ్వాలని పిలుపునిచ్చారు.
భారత ఆర్థిక వ్యవస్థ నేడు ప్రపంచ ఆర్థిక ధోరణులను ప్రభావితం చేస్తోందని రాష్ట్రపతి పేర్కొన్నారు.
అలాగే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) దూసుకుపోతోందని, అంతరిక్ష రంగంలో దేశానికి మరింత పేరు తెచ్చిందని తెలిపారు.
భారతదేశం గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో తన స్థాయిని మెరుగుపరుచుకుంటూ 2020లో 48వ స్థానం నుండి 2024లో 39వ స్థానానికి చేరుకుందని రాష్ట్రపతి వివరించారు.