LOADING...
Konaseema: నాలుగో రోజూ ఆరని బ్లోఅవుట్‌.. అరికట్టేందుకు ఓఎన్జీసీ చర్యలు
నాలుగో రోజూ ఆరని బ్లోఅవుట్‌.. అరికట్టేందుకు ఓఎన్జీసీ చర్యలు

Konaseema: నాలుగో రోజూ ఆరని బ్లోఅవుట్‌.. అరికట్టేందుకు ఓఎన్జీసీ చర్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 09, 2026
12:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

కోనసీమ జిల్లాలోని మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఉన్న ఓఎన్జీసీ గ్యాస్‌ బావిలో ఈ నెల 5న చోటుచేసుకున్న బ్లోఅవుట్‌ ఘటన ఇప్పటికీ పూర్తిగా నియంత్రణలోకి రాలేదు. నాలుగో రోజు గురువారం నాడు మంటల తీవ్రత కొన్నిసార్లు ఎక్కువగా, మరికొన్ని వేళలు తగ్గినట్టుగా మారుతూ కనిపించింది. ఈ ఘటనను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఓఎన్జీసీ టెక్నాలజీస్‌, ఫీల్డ్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ సక్సేనా, అలాగే సంస్థ నేషనల్‌ క్రైసిస్‌ మేనేజ్‌మెంట్‌ టీమ్‌ (ఎన్‌సీఎంటీ) హెడ్‌ శ్రీహరి నేతృత్వంలో సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు.

వివరాలు 

భారీ క్రేన్ల సాయంతో ట్రాలీలపై 300 మెట్రిక్‌ టన్నుల శకలాలు 

మంటలను తగ్గించేందుకు ఐదు వేల జీపీఎం (గ్యాలన్స్‌ పర్‌ మినిట్‌) సామర్థ్యం ఉన్న భారీ పంపు ద్వారా నీటిని మంటలపై చిమ్ముతున్నారు. ఇదే సమయంలో డ్రిల్లింగ్‌ సైట్‌ వద్ద మంటల కారణంగా దగ్ధమైన భారీ యంత్రాల శకలాలను తొలగించే పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు సుమారు 300 మెట్రిక్‌ టన్నుల శకలాలను భారీ క్రేన్ల సాయంతో ట్రాలీలపై తరలించారు. ఇంకా మరో 300 నుంచి 400 మెట్రిక్‌ టన్నుల వరకు శకలాలు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

వివరాలు 

వెల్‌ క్యాపింగ్‌కు ఏర్పాట్లు 

డ్రిల్లింగ్‌ సైట్‌లో మంటలు వ్యాపించిన బావి వద్దకు ఎన్‌సీఎంటీ బృందం చేరాలంటే చుట్టుపక్కల ఉన్నకాలిపోయిన శకలాలను పూర్తిగా తొలగించాల్సి ఉంటుంది. ఆప్రాంతాన్ని నూరుశాతం శుభ్రం చేసిన తర్వాతే బావి వద్దకు వెళ్లే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈపనులు ముగిసిన అనంతరం శుక్రవారం నుంచి వెల్‌ క్యాపింగ్‌ చర్యలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బ్లోఅవుట్‌ జరిగిన రోజు నుంచి ఇప్పటివరకు సుమారు మూడులక్షల క్యూబిక్‌ మీటర్ల గ్యాస్‌ దగ్ధమై ఉంటుందని అంచనా. ఈఘటనలో ముడిచమురు బయటకు రాలేదని,గ్యాస్‌లో కలిసిన ఘనీభవించిన నీరు మండటంతోనే పొగ విస్తరించినట్టు అధికారులు స్పష్టం చేస్తున్నారు. బ్లోఅవుట్‌ను నియంత్రించే చర్యలను జిల్లా కలెక్టర్‌ ఆర్‌. మహేష్‌కుమార్‌, అమలాపురం ఎంపీ గంటి హరీష్‌ మాథుర్‌,రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్‌ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు.

Advertisement