అమృత్‌పాల్ సింగ్ కోసం కొనసాగుతున్న వేట; పంజాబ్ పోలీసులకు 'బైసాఖి' సెలవులు రద్దు
ఈ వార్తాకథనం ఏంటి
ఖలీస్తానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసుల వేట ఇంకా కొనసాగుతోంది. రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు అహర్నిషలు అమృత్‌పాల్ కోసం వెతుకుతున్నారు. ఆపరేషన్ 'అమృత్‌పాల్ సింగ్'లో భాగంగా ఇప్పటికే పోలీసులు సెలవులు తీసుకోకుండా పని చేస్తున్నారు.
తాజాగా పంజాబీ కొత్త సంవత్సర పండుగ అయిన 'బైశాఖి' వేడుకలకు సంబంధించిన సెలవులను కూడా పంజాబ్ ప్రభుత్వం రద్దు చేసింది.
పంజాబీలకు 'బైశాఖి' అనేది చాలా పెద్ద పండగ. ఏప్రిల్ 14న ఈ వేడుకను జరుపుకోనున్నారు. దాదాపు వారం రోజుల పాటు 'బైశాఖి' ఉత్సవాలు జరుగుతాయి.
1699లో గురు గోబింద్ సింగ్ ఏప్రిల్ 14న 'ఖల్సా'ను స్థాపించారు. దీంతో ఆయనకు జ్ఞాపకంగా ఈ వేడుకను నిర్వహించడం పంజాబ్‌లో ఆనవాయితీగా వస్తోంది.
పంజాబ్
అమృత్‌పాల్ లొంగిపోతాడని కొన్ని రోజులుగా ప్రచారం
మార్చి 18 నుంచి అమృత్‌పాల్ సింగ్ పరారీలో ఉన్నారు. అయితే అతన్ని పట్టుకోవడంలో పంజాబ్ పోలీసులు ఇంకా సఫలీకృతం కాలేకపోయారు.
అదే సమయంలో అమృత్‌పాల్ సింగ్ చాలా రోజులుగా లొంగిపోతున్నాడనే ప్రచారం జరుగుతోంది. 'బైశాఖి'కి వేడుకకు ముందు అమృత్‌పాల్ లోంగిపోయే అవకాశం ఉందని మరోసారి ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే పోలీసులు మాత్రం ఈ వార్తను ధృవీకరించలేదు.
అమృత్‌పాల్ సింగ్ ప్రస్తుతం ఉన్న ప్రదేశం ఎవరికీ తెలియదు. అమృత్‌పాల్ పంజాబ్ నుంచి హర్యానాకు పారిపోయి అక్కడి నుంచి దిల్లీకి వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీలు చెబుతున్నాయి. గత వారం అమృతపాల్ సింగ్ పంజాబ్‌కు తిరిగి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.