Page Loader
Cyber attacks: భారత రక్షణ రంగానికి చెందిన వెబ్‌సైట్లు లక్ష్యంగా పాక్‌ సైబర్ గ్రూపులు దాడులు
భారత రక్షణ రంగానికి చెందిన వెబ్‌సైట్లు లక్ష్యంగా పాక్‌ సైబర్ గ్రూపులు దాడులు

Cyber attacks: భారత రక్షణ రంగానికి చెందిన వెబ్‌సైట్లు లక్ష్యంగా పాక్‌ సైబర్ గ్రూపులు దాడులు

వ్రాసిన వారు Sirish Praharaju
May 05, 2025
07:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

పహల్గాం ఉగ్రదాడికి భారత్‌ కౌంటర్ చర్యలు చేపడుతుండటంతో పాకిస్థాన్‌ అసహనం వ్యక్తం చేస్తోంది. ప్రత్యక్షంగా ప్రతీకారం తీర్చలేకపోయిన దాయాది దేశం ఇప్పుడు సైబర్ దాడుల రూపంలో భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుంటోంది. ఈ క్రమంలో పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న సైబర్ ముఠాలు భారత రక్షణ రంగానికి చెందిన కీలక వెబ్‌సైట్లపై దాడులకు పాల్పడుతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సైనిక ఇంజినీరింగ్ సేవలు (మిలిటరీ ఇంజినీర్‌ సర్వీసెస్‌), అలాగే మనోహర్ పారికర్ డిఫెన్స్ అండ్ అనాలిసిస్ ఇనిస్టిట్యూట్‌కు సంబంధించిన సున్నతమైన సమాచారం పాకిస్థాన్ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లినట్టు వారు తమ 'పాకిస్థాన్‌ సైబర్ ఫోర్స్ ఎక్స్‌' పేరిట ప్రకటించారు.

వివరాలు 

ఆన్‌లైన్ వ్యవస్థను తాత్కాలికంగా నిలిపివేసి..

అంతేకాదు, రక్షణ శాఖ పరిధిలో పని చేస్తున్న 'ఆర్మ్డ్ వెహికిల్‌ నిగమ్ లిమిటెడ్‌' వెబ్‌సైట్‌ను హ్యాక్ చేయాలని ప్రయత్నించామని ప్రకటించడంతో పాటు దానికి సంబంధించిన చిత్రాలను కూడా ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఆయా అధికార సంస్థలు తమ ఆన్‌లైన్ వ్యవస్థను తాత్కాలికంగా నిలిపివేసి, ఎంత నష్టం వాటిల్లిందో అంచనా వేస్తున్నాయి. ఇక మరోవైపు, ఇటువంటి దాడులను ముందుగానే గుర్తించి అడ్డుకోవడంలో సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు ముమ్మరంగా కృషి చేస్తున్నారని సమాచారం. పహల్గాం ఉగ్రదాడి దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆ దాడి అనంతరం భారత్‌లో సుమారు పది లక్షల సైబర్ దాడులు జరిగినట్టు మహారాష్ట్ర సైబర్ విభాగం రెండు రోజుల క్రితం వెల్లడించింది.

వివరాలు 

దాడిలో కీలకమైన ప్రభుత్వ డేటాను హ్యాకర్లు దొంగిలించారు 

ఈ దాడులు పాకిస్థాన్‌తో పాటు ఇతర విదేశీ హ్యాకింగ్ గ్రూపుల నుంచి జరిగాయని వెల్లడించింది. అంతేకాదు, జమ్ము మున్సిపల్‌ కార్పొరేషన్‌పై కూడా సైబర్‌ దాడి జరగిందని అధికారులు తెలిపారు. ఈ దాడిలో కీలకమైన ప్రభుత్వ డేటాను హ్యాకర్లు దొంగిలించారని వెల్లడించారు. అనేక సర్టిఫికెట్లు కూడా ఈ దాడితో పోయినట్టు తెలిపారు. ప్రస్తుతం దెబ్బతిన్న వెబ్‌సైట్‌ను తిరిగి పునరుద్ధరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా సైబర్‌ సెక్యూరిటీ అప్రమత్తత్వాన్ని పెంచుతూ అలర్ట్ జారీ చేసింది. ప్రభుత్వ శాఖలు, మంత్రిత్వాలయాలు, సంబంధిత ఏజెన్సీలన్నీ తమ సైబర్‌ రక్షణ వ్యవస్థలను మరింత బలంగా తీర్చిదిద్దుకోవాలని కేంద్రం సూచించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

భారత రక్షణ రంగానికి చెందిన వెబ్‌సైట్లు లక్ష్యంగా పాక్‌ సైబర్ గ్రూపులు దాడులు