Pakistan: పాక్ వక్రబుద్ధి.. హేమ్‌కుండ్ సాహిబ్ యాత్రకు సిక్కు భక్తులకు అడ్డంకులు
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ మరోసారి తన తీరును బయటపెట్టిందని సిక్కు యాత్రికులు ఆవేదన వ్యక్తం చేశారు. భారత్‌లోని ప్రముఖ సిక్కు పుణ్యక్షేత్రమైన శ్రీ హేమ్‌కుండ్ సాహిబ్‌ను దర్శించుకునేందుకు బయలుదేరిన భక్తులను 'నో అబ్జెక్షన్ సర్టిఫికేట్' (NOC) పేరుతో అధికారులు అడ్డుకున్నారు. దీంతో యాత్రికులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తమ ప్రయాణానికి ఎన్‌వోసీ అవసరమనే విషయాన్ని అధికారులు ముందుగా తెలియజేయలేదని భక్తులు తెలిపారు. విమానాశ్రయంలో ఈ నిబంధనను చెప్పడంతో ప్రయాణం నిలిచిపోయిందని, ఫలితంగా విమానాన్ని కోల్పోయి అక్కడే చిక్కుకుపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
వివరాలు
విమానాశ్రయంలో ఎన్‌వోసీ కోసం పట్టు
యాత్రికుల వివరాల ప్రకారం.. శుక్రవారం తెల్లవారుజామున 2.10 గంటలకు ఫైసలాబాద్ నుంచి షార్జాకు విమానంలో వెళ్లి, అక్కడి నుంచి ఢిల్లీ చేరుకోవాల్సి ఉంది.
అయితే విమానాశ్రయంలో అధికారులు ఎన్‌వోసీ కోసం పట్టుబట్టడంతో వారు ప్రయాణం చేయలేకపోయారు.
అంతకుముందు నంకానా సాహిబ్‌లో పాకిస్థాన్ పంజాబ్ సిక్కు మైనారిటీ మంత్రి, పాకిస్థాన్ సిక్కు గురుద్వారా ప్రబంధక్ కమిటీ (PSGPC) అధ్యక్షుడు రమేశ్ అరోరా, ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డు డిప్యూటీ సెక్రటరీ నాసిర్ ముష్తాక్ యాత్రికులను కలిశారు.
వివరాలు
భూసరిహద్దు ద్వారా పంపిస్తామని హామీ
విమాన మార్గంలో భారత్‌కు వెళ్లకుండా అట్టారి-వాఘా భూసరిహద్దు ద్వారా రోడ్డు మార్గంలో పంపిస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు పపిందర్ సింగ్ తెలిపారు.
అయితే ఎన్‌వోసీ అవసరమనే విషయాన్ని ముందుగా తమకు ఎవరూ చెప్పలేదని ఆయన పేర్కొన్నారు.
విమానాశ్రయంలో అధికారులు ఎన్‌వోసీ అడిగినప్పుడు, దాన్ని సమకూర్చాలని రమేశ్ అరోరాను కోరామని.. అయితే ఆయన కూడా తమకు సహాయం చేయలేకపోయారని సింగ్ వివరించారు.
యాత్రికులకు ఢిల్లీ, అమృత్‌సర్, శ్రీ ఆనంద్‌పూర్ సాహిబ్, శ్రీ హేమ్‌కుండ్ సాహిబ్‌లను సందర్శించేందుకు భారత వీసాలు ఇప్పటికే మంజూరయ్యాయి.
వివరాలు
92 మంది భక్తులకు వీసాలు.. రూ.2 కోట్ల ఖర్చు
అట్టారి-వాఘా భూసరిహద్దు మూసివేయడంతో విమాన మార్గం తప్ప మరో మార్గం లేకుండా పోయిందని యాత్రికులు తెలిపారు.
శ్రీ హేమ్‌కుండ్ సాహిబ్ యాత్ర కోసం భారత్ 92 మంది సిక్కు భక్తులకు వీసాలు జారీ చేసిందని పపిందర్ సింగ్ చెప్పారు.
ప్రయాణం, వసతి, ఇతర ఏర్పాట్ల కోసం దాదాపు 2 కోట్ల పాకిస్థాన్ రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు.
ఇప్పుడు ప్రయాణానికి అనుమతి లభించకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యామని అన్నారు.
ఫైసలాబాద్-షార్జా విమానం ఇప్పటికే మిస్ కావడంతో.. షార్జా నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన తదుపరి విమానం కూడా మిస్ అయ్యే పరిస్థితి ఏర్పడిందని వివరించారు.
వివరాలు
ప్రత్యేక అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి
ప్రస్తుతం యాత్రికులు విమానాశ్రయంలోనే ఉన్నారు. సమస్యను పరిష్కరించి, అట్టారి-వాఘా భూసరిహద్దు ద్వారా భారత్‌కు వెళ్లేందుకు ప్రత్యేక అనుమతి ఇవ్వాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
హేమ్‌కుండ్ సాహిబ్ యాత్రను నిర్ణయించిన సమయంలోగా పూర్తి చేసుకునే అవకాశం కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికే వీసాలు మంజూరైన నేపథ్యంలో తమ ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.