
Vikram Misri: తప్పుడు ప్రచారాలకు పాకిస్థాన్ ప్రసిద్ధి : భారత్
ఈ వార్తాకథనం ఏంటి
విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారత్‌లోని ప్రార్థనా మందిరాలపై కూడా పాక్ లక్ష్యంగా పనిచేస్తోందని ఆరోపించారు.
భారతదేశంపై దుష్ప్రచారానికి పాల్పడుతుందంటూ విమర్శించారు. తప్పుడు సమాచారం వ్యాప్తిలో పాక్‌కి ప్రసిద్ధి చెందిందని, తాజాగా నన్కానా సాహిబ్ గురుద్వారా ఘటనతో ఇది మరింత స్పష్టమైందన్నారు.
ఆ గురుద్వారాపై భారత్ లక్ష్యంగా దాడి చేసిందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఖండించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే నిందతో మతపరమైన రంగు వేసే ప్రయత్నం పాక్ చేస్తోందని ఆయన విమర్శించారు.
గత గురువారం రాత్రి, పాకిస్థాన్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడిందని మిస్రీ తెలిపారు.
Details
భారత్ ప్రతీకార దాడులు
భారత నగరాలు, పౌర సదుపాయాలు, సైనిక స్థావరాలే పాక్ లక్ష్యంగా తీసుకుందని, బఠిండాలోని సైనిక స్థావరంపై డ్రోన్‌ల దాడికి పాల్పడినట్టు పేర్కొన్నారు.
భారత సాయుధ బలగాలు వాటిని విజయవంతంగా తిప్పికొట్టినట్టు చెప్పారు. అనంతరం భారత వైమానిక బలగాలు పాక్‌లోని నాలుగు గగనతల రక్షణ వ్యవస్థలపై ప్రతీకార దాడులు జరిపినట్టు వెల్లడించారు.
ఈ దాడుల్లో పాక్‌కు చెందిన ఒక ఏయిర్ డిఫెన్స్ (AD) రాడార్ వ్యవస్థను భారత డ్రోన్ ధ్వంసం చేసిందన్నారు.
అయితే, ఈ దాడుల విషయాన్ని పాకిస్థాన్ అధికార యంత్రాంగం నిరాకరించడం వారి ద్వంద్వ వైఖరిని స్పష్టంగా చూపిస్తోందన్నారు.
Details
పాఠశాలలే లక్ష్యంగా పాక్ దాడులు
అదే సమయంలో నియంత్రణ రేఖ వెంబడి పాఠశాలలు, ప్రార్థనాలయాలపై పాక్ లక్ష్యంగా దాడులు చేస్తోందన్నారు.
పూంచ్‌లో ఓ పాఠశాల సమీపంలోని ఇంటిపై జరిగిన దాడిలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు.
కాల్పుల భయంతో పాఠశాల సిబ్బంది సహా అనేకమంది బంకర్లలో తలదాచుకున్నారని, అదృష్టవశాత్తూ పాఠశాల మూసివేసి ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పినట్టు తెలిపారు.
పాక్ ఈ తరహా చర్యలు తీసుకోవడం వారి దిగజారిన ప్రవర్తనకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.
భద్రతా పరిస్థితుల దృష్ట్యా కర్తార్‌పుర్ సాహిబ్ కారిడార్ సేవలను తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు మిస్రీ వెల్లడించారు.
Details
పాకిస్థాన్ రెచ్చగొడుతోంది
అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) సమావేశం నేడు జరుగుతుందని, పాకిస్థాన్‌కు సంబంధించి భారత్ తన అభిప్రాయాలను ఆ సమావేశంలో స్పష్టంగా వ్యక్తం చేస్తుందని పేర్కొన్నారు.
తదుపరి చర్యలపై నిర్ణయం IMF బోర్డుకు వదిలిపెట్టినట్టు చెప్పారు.
ఈ ఉదంతాలన్నింటిలోనూ పాకిస్థాన్ రెచ్చగొట్టే ధోరణి, తప్పుడు సమాచారం వ్యాప్తి, మతపరమైన రంగు వేసే కుట్రలు, శాంతియుత ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునే విధానం వెల్లడైందని విక్రమ్ మిస్రీ స్పష్టంచేశారు.