
IndiGo Flight: అనుమతికి పాక్ 'నో'.. 227 మందిని కాపాడిన పైలట్లు
ఈ వార్తాకథనం ఏంటి
ఉరుములు, మెరుపులతో కూడిన కారుమేఘాలు.. విమానం మెల్లగా ముందుకు సాగితే ప్రయాణికులందరికీ ప్రాణహాని తప్పదు.
మార్గం మార్చాలంటే ప్రత్యామ్నాయ దారి పాకిస్థాన్ గగనతలంలోకి వెళ్తుంది. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అదే మార్గం అనుసరించలేని పరిస్థితి.
అయినప్పటికీ ప్రయాణికుల భద్రత కోసమే ఇండిగో పైలట్లు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్ గగనతలంలోకి కొద్ది క్షణాలు వెళ్లేందుకు లాహోర్ ఏటీసీని సంప్రదించారు.
కానీ అక్కడి నుంచి 'నో' అని సమాధానం వచ్చింది. చివరకు ముప్పుతో కూడిన కారుమేఘంలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ భయానక వాతావరణాన్ని అధిగమించి, 227 మంది ప్రయాణికులను పైలట్లు సురక్షితంగా శ్రీనగర్ తీసుకెళ్లారు.
Details
ఏం జరిగింది..?
బుధవారం దిల్లీ నుంచి శ్రీనగర్‌కు బయలుదేరిన ఇండిగో 6ఇ 2142 విమానం పఠాన్‌కోట్ సమీపంలో భయానక వాతావరణాన్ని ఎదుర్కొంది.
ప్రమాదకరమైన మేఘాల కారణంగా ఎడమవైపు (అంతర్జాతీయ సరిహద్దు దిశగా) దారి మళ్లించాల్సిన అవసరం ఏర్పడింది.
పైలట్లు నార్తర్న్ కంట్రోల్‌ను సంప్రదించి, మార్గం మళ్లింపునకు అనుమతించమని కోరారు. కానీ, పాక్ వేసిన 'నోటమ్' ప్రకారం భారత విమానాలకు గగనతలం మూసివేసిన నేపథ్యంలో ఇది సాధ్యపడలేదు.
ఈ నేపథ్యంలో ఇండిగో సిబ్బంది లాహోర్ ఏటీసీతో నేరుగా సంప్రదించగా, అక్కడినుంచి కూడా నిరాకరణే వచ్చింది.
Details
అత్యవసరంగా తీసుకున్న నిర్ణయం
ఇప్పటికే మేఘాలకు బాగా చేరువైన విమానాన్ని తిరిగి దిల్లీకి మళ్లించడం సాధ్యపడలేదు. మేఘాల్లోకి ప్రవేశించక తప్పలేదు. వెంటనే తీవ్ర వడగళ్ల వాన మొదలైంది.
గాలితుఫాను తీవ్రతకు ఆటోపైలట్ వ్యవస్థ మొరాయించింది. అనేక హెచ్చరిక సంకేతాలు కాక్‌పిట్‌లో మోగాయి. విమాన వేగం గరిష్ఠ స్థాయికి చేరినట్లు, స్టాల్ పరిస్థితి తలెత్తినట్లు సూచనలు వచ్చాయి.
యాంగిల్ ఆఫ్ ఎటాక్ లోపంతో విమానం కంట్రోల్ తప్పిపోయే స్థితికి చేరింది.
సాధారణంగా నిమిషానికి 1,500-3,000 అడుగులు కిందకు వచ్చే విమానం.. ఈ సమయంలో నిమిషానికి 8,500 అడుగుల వేగంతో కిందకు జారింది. ప్రయాణికులు భయంతో కేకలు వేస్తూ సీట్లు పట్టుకున్నారు.
Details
చివరికి సురక్షిత ల్యాండింగ్
విమానం స్టాల్‌కు చేరకముందే పైలట్లు దానిని తిరిగి తమ నియంత్రణలోకి తీసుకున్నారు.
కారుమేఘం నుంచి బయటకు తీసుకువచ్చి శ్రీనగర్ చేరుకున్నారు. విమానంలో రాడోమ్ భాగం దెబ్బతిన్నప్పటికీ ఇతర వ్యవస్థల్లో తక్కువగా సమస్యలు తలెత్తాయి.
పైలట్ల చాకచక్యంతో ప్రయాణికులెవరూ గాయపడలేదు.
లాహోర్ ఏటీసీ అనుమతి ఇవ్వకపోయినా.. మిగిలిన మార్గాల్లో సమన్వయం చేసేందుకు భారత వైమానిక దళం సహకరించిందని తెలిపింది. ఈ ఘటనపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది.