Pawan Kalyan: గ్రామీణ అభివృద్ధి కోసం పంచాయతీల గ్రేడ్ల విభజన.. పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
పంచాయతీలను జనాభా ప్రాతిపదికన గ్రేడ్లుగా విభజించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు.
పంచాయతీల ఆదాయం ఆధారంగా ఏర్పడిన క్లస్టర్ వ్యవస్థ వల్ల సిబ్బంది నియామకం విషయంలో సమస్యలు ఏర్పడుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ఈ సమస్యల దృష్ట్యా, పంచాయతీలను గ్రేడ్లుగా విభజించే మార్గదర్శకాలు రూపొందించాలని ఆయన సూచించారు. ఈ విషయంపై సోమవారం, ఆ శాఖ ఉన్నతాధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు.
జనాభా ఆధారంగా పంచాయతీలను గ్రేడ్లుగా విభజించేందుకు, సిబ్బంది నియామకానికి సంబంధించిన అంశాలను అధ్యయనం చేసేందుకు నలుగురు సీనియర్ అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలన్నారు.
Details
నివేదికను పరిశీలించనున్న కమిటీ
జిల్లాను యూనిట్‌గా తీసుకొని, 26 జిల్లాల్లో పంచాయతీల ఆదాయం, జనాభా ప్రాతిపదికగా కలెక్టర్లు ఇచ్చే నివేదికలను ఈ కమిటీ పరిశీలించనుంది.
ఆ తరువాత, ప్రభుత్వ ఆమోదంతో పంచాయతీల గ్రేడ్లు, సిబ్బంది కేటాయింపులు తదితర అంశాలు నిర్ణయిస్తాయి.
గ్రామాల్లో తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, అంతర్గత రోడ్ల నిర్మాణం, పారిశుద్ధ్య పనులకు అవసరమైన సిబ్బంది అందుబాటులో ఉంటారు.
వైసీపీ ప్రభుత్వం క్లస్టర్ విధానాన్ని తీసుకున్నా ఆదాయం ఎక్కువగా ఉన్న పంచాయతీలలో జనాభా తక్కువగా, ఆదాయం తక్కువగా ఉన్న పంచాయతీలలో జనాభా ఎక్కువగా ఉండటంతో, ఇప్పుడు ఈ క్లస్టర్ విధానంలో మార్పులు చేసి, పంచాయతీలను గ్రేడ్లుగా విభజించి ప్రజలకు ప్రయోజనకరంగా మార్పులు చేస్తోంది.