Pawan Kalyan: గజేంద్ర సింగ్ షెఖావత్‌తో పవన్ కల్యాణ్ భేటీ.. ఏడు కీలక పర్యాటక ప్రాజెక్టులపై చర్చ!
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దిల్లీలో పర్యటిస్తున్నారు. సోమవారం ఆయన తన పర్యటనలో భాగంగా కాసేపటి క్రితం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్‌తో పాటు జనసేన ఎంపీలు వల్లభనేని బాలశౌరి, ఉదయ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు. సమావేశం అనంతరం మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. కేంద్ర జలశక్తి మంత్రిగా గజేంద్ర సింగ్ పర్యవేక్షణలో పోలవరం ప్రాజెక్టు కోసం సహకారాన్ని అందించాలని కోరామన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో 7 ప్రాజెక్టులపై ప్రతిపాదనలు ఇచ్చామన్నారు. ఏపీకి 975 కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని, గండికోటను 'ఇండియన్ గ్రాండ్ కేనియన్' అభివృద్ధి చేయవచ్చని సూచించారు.
రేపు ప్రధానితో పవన్ కళ్యాణ్ సమావేశం
ఇక పర్యాటక విశ్వవిద్యాలయం ఏర్పాటుకు గజేంద్ర సింగ్ షెఖావత్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు పవన్ తెలిపారు. పవన్ కళ్యాణ్ ఇవాళ మధ్యాహ్నం 1:00 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రితో మరో భేటీ, 3:15 గంటలకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశం, 4:30కి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో చర్చలు నిర్వహించనున్నారు. సాయంత్రం 5:15కి పంచాయితీ రాజ్ శాఖ మంత్రి లలన్ సింగ్‌తో సమావేశం ఏర్పాటు చేశారు. రేపు ప్రధాని నరేంద్ర మోడీతో కూడా సమావేశం జరిపే అవకాశం ఉంది.