కాబోయే తండ్రులకు కూడా 12 వారాల సెలవు ప్రవేశపెట్టిన ఫైజర్ ఇండియా
డ్రగ్ తయారీ సంస్థ ఫైజర్ భారతదేశంలో తన ఉద్యోగుల కోసం 12 వారాల పితృత్వ సెలవు విధానాన్ని ఉద్యోగుల-కేంద్రీకృత పని వాతావరణాన్ని పెంపొందించే కార్యక్రమాలలో భాగంగా ప్రవేశపెట్టింది. కొత్త సెలవు విధానం జనవరి 1, 2023 నుండి వర్తిస్తుందని, సహజంగా తండ్రి అవుతున్న, దత్తత తీసుకున్న తండ్రులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చని కంపెనీ తెలిపింది. పితృత్వ సెలవు విధానంలో బిడ్డ పుట్టినా లేదా పుట్టకపోయినా సరే ఆ రెండు సంవత్సరాల వ్యవధిలో సెలవులు పొందే సౌలభ్యాన్ని ఈ పాలసీ అందిస్తుంది. కనీస రెండు వారాలు నుండి గరిష్టంగా ఆరు వారాల వరకు తీసుకోవచ్చని ఈ సంస్థ పేర్కొంది. అత్యవసరం సమయంలో ఆ ఉద్యోగికి అదనపు సెలవులు కూడా అనుమతించబడతాయని పేర్కొంది.
ఇదే బాటలో నడుస్తున్న మరిన్ని సంస్థలు
ఇంతకుముందు, మరో డ్రగ్ తయారీ సంస్థ నోవార్టిస్ ఇలాంటి విధానాలను తీసుకువచ్చింది. ఇతర అంతర్జాతీయ, స్థానిక కంపెనీలు కూడా ఇటువంటి విధానాలను ఎక్కువగా అనుసరిస్తున్నాయి. సంస్థలు తమ ఉద్యోగులకు ఇటువంటి సౌకర్యాలు కల్పించడం ద్వారా సంస్థను ఉద్యోగుల అనుకూల సంస్థలుగా మార్చుకుంటున్నాయ. ఫైజర్ ఇండియా డైరెక్టర్ పీపుల్ ఎక్స్‌పీరియన్స్ శిల్పి సింగ్ మాట్లాడుతూ, ఈ తరహా పాలసీల ద్వారా ఉద్యోగులకు సంస్థ మద్దతుని ఇవ్వడం వలన తల్లిదండ్రులుగా తమ పాత్రలలో పురుషులు, మహిళలు సమాన సమయాన్ని పనిలోనూ, వ్యక్తిగత జీవితంలోను పెట్టుబడి పెట్టడానికి వీలు కుదురుతుందని అభిప్రాయపడ్డారు.