PM Modi: మన్‌కీబాత్ నాకు పవిత్ర యాత్రతో సమానం: ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
మన్‌కీబాత్ ప్రజల భాగస్వామ్యంతో 12 ఏళ్లుగా కొనసాగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విజయదశమి రోజున ప్రారంభమైన ఈ కార్యక్రమం తనకు తీర్థయాత్రతో సమానమని పేర్కొన్నారు. 139వ మన్‌కీబాత్ ఎపిసోడ్‌లో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. ప్రజల కృషి, ధైర్యం, అంకితభావం, సేవా స్ఫూర్తిని గుర్తుచేసుకునేందుకు ఈ కార్యక్రమం ఒక వేదికగా నిలుస్తోందన్నారు. ఈ ప్రయాణంలో ప్రజలు భాగస్వాములుగా, మార్గదర్శులుగా మారారని చెప్పారు. పంజాబ్‌లో సంప్రదాయ వ్యవసాయానికి మళ్లీ ప్రోత్సాహం అందిస్తున్న ఖేతీ విరాసత్ మిషన్ గురించి మోదీ ప్రస్తావించారు. సేంద్రియ సాగుతో పాటు సంప్రదాయ పద్ధతులను పునరుద్ధరించేందుకు ఈ సంస్థ కృషి చేస్తోందని తెలిపారు. ముఖ్యంగా పంజాబ్‌లోని మాల్వా ప్రాంతంలో పత్తి సాగును ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు.
వివరాలు
హెవల్ నదిని పునరుజ్జీవింపజేసేందుకు స్థానికులను ప్రశంసించిన ప్రధాని
ఉత్తరాఖండ్‌లోని గఢ్‌వాల్ ప్రాంతంలో హెవల్ నదిని పునరుజ్జీవింపజేసేందుకు స్థానికులు చేసిన ప్రయత్నాలను ప్రధాని ప్రశంసించారు.
కొంతకాలం క్రితం నదిలో నీటి మట్టం గణనీయంగా తగ్గిపోయిందని చెప్పారు.
దీంతో స్థానిక అధికారులు, గ్రామస్థులు వర్షపు నీటిని నిల్వ చేసుకునేందుకు పలు చర్యలు చేపట్టారని తెలిపారు.
పెద్ద సంఖ్యలో మొక్కలు నాటడంతో పాటు ఇతర ప్రయత్నాలు చేయడం వల్ల నదిలో మళ్లీ నీటి ప్రవాహం పెరిగిందని పేర్కొన్నారు.