PM Modi: రాజ్యాంగాన్ని బలోపేతం చేయాలి.. ప్రతి పౌరుడి జీవితంలో భాగం కావాలి: మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక వ్యాసం రాశారు. పలు దినపత్రికల్లో ప్రచురితమైన ఈ వ్యాసానికి 'రాజ్యాంగాన్ని బలోపేతం చేసేందుకు ఒక నిబద్ధత' అనే శీర్షిక పెట్టారు. రాజ్యాంగంలోని సూత్రాలు కేవలం పార్లమెంటు, న్యాయస్థానాలకే పరిమితం కాకూడదని, ప్రతి పౌరుడి రోజువారీ జీవితంలో భాగం కావాలని ఆయన ఆకాంక్షించారు. రాజ్యాంగ రూపకర్తలు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌లకు ఈ సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. సామాన్య కుటుంబంలో జన్మించిన వ్యక్తి సైతం దేశ ప్రధానమంత్రి స్థాయికి ఎదిగే అవకాశం కల్పించడం భారత రాజ్యాంగ గొప్పతనానికి నిదర్శనమని మోదీ పేర్కొన్నారు.
వివరాలు
సామాజిక, ఆర్థిక న్యాయం అందించాలన్నది రాజ్యాంగ ప్రధాన లక్ష్యం
సామాజిక, ఆర్థిక న్యాయం అందించాలన్నది రాజ్యాంగ ప్రధాన లక్ష్యమని ప్రధాని గుర్తుచేశారు.
ఈ స్ఫూర్తితోనే తమ ప్రభుత్వం పీఎం ఆవాస్ యోజన, ఉజ్వల, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలను అమలు చేస్తోందని వివరించారు.
తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పలు కీలక రాజ్యాంగ సవరణలను కూడా వ్యాసంలో ప్రస్తావించారు.
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలుకు సంబంధించిన 101వ రాజ్యాంగ సవరణ, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించిన 102వ సవరణ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) 10 శాతం రిజర్వేషన్లు కల్పించిన 103వ సవరణ ఇందులో ముఖ్యమైనవని తెలిపారు.
ఇదే సమయంలో గత ప్రభుత్వాల తీరుపై మోదీ విమర్శలు చేశారు.
వివరాలు
2047 నాటికి వికసిత భారత్ లక్ష్యం
ఒక రాజకీయ పార్టీ గతంలో దాదాపు వందసార్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 356ను దుర్వినియోగం చేసి రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసిందని ఆరోపించారు.
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370ను రద్దు చేయడాన్ని చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దిన చర్యగా అభివర్ణించారు.
ప్రధాన ప్రతిపక్షంపై కూడా విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షం తన బాధ్యతను నిర్వర్తించకుండా 'విరోధ్ పక్ష్'(వ్యతిరేకించే పక్షం)నుంచి 'అవరోధ్ పక్ష్'(అడ్డంకులు సృష్టించే పక్షం)గా మారిందంటూ ఎద్దేవా చేశారు.
2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న'వికసిత భారత్' లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు.
ఈ లక్ష్య సాధనలో 'భారత్ ఫస్ట్'అనే ఆలోచన,'కర్తవ్యం' అనే ఆచరణ ప్రతి ఒక్కరికీ మార్గదర్శకాలుగా ఉండాలని మోదీ తన వ్యాసంలో పేర్కొన్నారు.