LOADING...
Venezuela Earthquakes: వరుస భూకంపాలతో వెనెజువెలాలో విషాదం.. మోదీ దిగ్భ్రాంతి
వరుస భూకంపాలతో వెనెజువెలాలో విషాదం.. మోదీ దిగ్భ్రాంతి

Venezuela Earthquakes: వరుస భూకంపాలతో వెనెజువెలాలో విషాదం.. మోదీ దిగ్భ్రాంతి

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 25, 2026
11:55 am

ఈ వార్తాకథనం ఏంటి

వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటివరకు 32 మంది మృతి చెందగా, సుమారు 700 మంది గాయపడినట్లు తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ వెల్లడించారు. రాజధాని కరాకస్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో భూకంప ప్రభావం తీవ్రంగా ఉండటంతో అనేక భవనాలు కూలిపోయాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోవడంతో సహాయక బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వివరాలు 

వెనెజువెలాకు అండగా ఉంటాం: మోదీ

వెనెజువెలాలో చోటుచేసుకున్న ప్రకృతి విపత్తుపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో వెనెజువెలా ప్రజలకు భారత్ అండగా ఉంటుందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

వివరాలు 

తక్షణ సహాయానికి సిద్ధం: ట్రంప్

భూకంప ప్రభావిత వెనెజువెలా ప్రజలకు అవసరమైన సహాయం అందించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ట్రూత్ సోషల్‌లో చేసిన పోస్టులో ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే సహాయక చర్యలు ప్రారంభించేందుకు సంబంధిత అన్ని ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. వెనెజువెలా ప్రజలు అమెరికాకు గొప్ప స్నేహితులని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే సహాయక బృందాలను ప్రభావిత ప్రాంతాలకు పంపినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు.

Advertisement