మధ్యప్రదేశ్ పర్యటనలో నరేంద్ర మోదీ.. ఒకేసారి 5 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు పచ్చ జెండా
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్ పర్యటనలో భాగంగా కొత్తగా ఐదు వందే భారత్ రైళ్లకు జెండా ఊపారు. దీంతో తొలిసారిగా ఏకకాలంలో ఒకటికంటే ఎక్కువ సంఖ్యలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లను ప్రారంభించినట్టైంది.
అత్యాధునిక సౌకర్యాలు కలిగిన సెమీ హైస్పీడ్ రైళ్లుగా భారతీయ రైల్వే శాఖ వీటిని ప్రవేశపెట్టింది. ఈ మేరకు పలు రాష్ట్రాల ప్రధాన నగరాలతో అనుసంధానం కోసం వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
కార్యక్రమంలో రైల్వేశాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్, మధ్యప్రదేశ్ గవర్నర్ మంగుభాయ్ పటేల్, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ సహా కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, జ్యోతిరాదిత్య సింధియా తదితరులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
DETAILS
ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు
రెండు రైళ్లను నేరుగా ప్రారంభించిన మోదీ, మిగతా మూడింటిని వర్చువల్ విధానంలో పచ్చ జెండా ఊపారు.
1. రాణికమలాపతి (భోపాల్) నుంచి జబల్‌పూర్
2. ఖజురహో - భోపాల్ - ఇండోర్
3. హతియా - పట్నా
4. ధార్వాడ్ నుంచి బెంగళూరు
5. గోవా (మడ్గావ్) నుంచి ముంబయి వరకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభమయ్యాయి.
ఇవాళ ఉదయం భోపాల్ విమానాశ్రయం నుంచి రాణికమలాపతి రైల్వే స్టేషన్ కు మోదీ హెలికాప్టర్‌లో రావాల్సి ఉంది. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో రోడ్డు మార్గానే చేరుకున్నట్లు ఆ పార్టీ మీడియా సెల్ వెల్లడించింది.
ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ రాక ప్రాధాన్యం సంతరించుకుంది.