నా కొడుకు మోదీకే ఓటేస్తా.. 25 ఎకరాల పొలాన్ని కూడా ఇచ్చేస్తానన్న వందేళ్ల బామ్మ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఓ బామ్మ తన 25 ఎకరాల ఆస్తిని రాసిచ్చేస్తానంటూ సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు మోదీ తన 15వ కుమారుడితో సమానమన్నారు. మధ్యప్రదేశ్ లోని రాజ్‌గఢ్ జిల్లా హరిపుర గ్రామానికి చెందిన మంగీబాయి తన్వర్ కు దాదాపు వందేళ్లు ఉంటాయి. అయితే ఈ బామ్మకు ఇప్పటికే 14 మంది సంతానం. కాగా తాజాగా మోదీని తన 15వ కుమారుడిగా భావిస్తానన్నారు. మోదీ దేశానికి విశేష సేవలు అందిస్తున్నారని ఆమె కొనియాడారు. తన లాంటి వృద్ధులకు సంక్షేమ పథకాల ద్వారా ఆదుకుంటున్నారని చెప్పారు. మంగీబాయి చుట్టూ ఉన్న స్థానికులు ప్రధాని ఫోటో చూపించి ఇతనెవరో తెలుసా అని అడిగారు. ఇతను మోదీ, నాకు తెలుసు టీవీల్లో చూశానని బదులిచ్చారు.
అందుకే మోదీ నా 15వ కుమారుడు
ప్రధాని మోదీ తనకు నివాసం ఇచ్చారని, అలాగే ఉచితంగా వైద్యం అందించారని సదరు బామ్మ చెబుతున్నారు. అలాగే వితంతు పెన్షన్ ను సైతం ఇస్తున్నారని వెల్లడించింది. ఆయన వల్లే తాను తీర్థయాత్రలకూ వెళ్లగలిగానని ఆనందం వ్యక్తం చేశారు. అందుకే మోదీని తన 15వ కుమారుడిలాగా భావిస్తున్నానని స్పష్టం చేశారు. తనకు మోదీని చూడాలని ఉందని, అవకాశం ఉంటే స్వయంగా కలుస్తానని మంగీబాయి తన్వర్ తన మనసులోని మాటను పంచుకున్నారు. ప్రస్తుతం మంగీబాయి తన్వర్ వీడియో నెట్టింట సందడి చేస్తోంది. తాను మోదీకి మాత్రమే ఓటు వేస్తానని స్పష్టం చేయడం విశేషం. మరోవైపు ఇవాళ ప్రధాని మధ్యప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భోపాల్ రోడ్ షోలో పాల్గొననున్నారు.