Page Loader
ప్రధాని మోదీ రాజస్థాన్‌ పర్యటనలో రాజకీయ కోణం? ‌అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యమా?
దేవ్‌నారాయణ్ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు రాజస్థాన్‌కు ప్రధాని మోదీ

ప్రధాని మోదీ రాజస్థాన్‌ పర్యటనలో రాజకీయ కోణం? ‌అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యమా?

వ్రాసిన వారు Stalin
Jan 28, 2023
11:12 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తొమ్మిది రాష్ట్రాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా రాజస్థాన్‌‌పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో డిసెంబర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామని బీజేపీ భావిస్తోంది. అందుకే మోదీ కూడా రాజస్థాన్‌పై శ్రద్ధ కనబరుస్తున్నారు. రిపబ్లిక్ డే నాడు రాజస్థాన్ తలపాగా ధరించి ఆ రాష్ట్ర ప్రజలను సర్‌ప్రైజ్ చేసిన మోదీ, శనివారం రాజస్థాన్ పర్యటనకు వెళ్లారు. భిల్వారా జిల్లాలో గుర్జార్ గిరిజన సామాజిక వర్గ ఆరాధ్య దైవం దేవ్‌నారాయణ్ జయంతి వేడుకల్లో మోదీ పాల్గొంటారు. గుర్జార్ గిరిజన సామాజిక వర్గం దేవ్‌నారాయణ్‌ని మహావిష్ణువు అవతారంగా భావిస్తుంటారు. అందుకే ప్రతి ఏటా ఆయన జన్మించిన మలసేరి దుంగ్రి గ్రామంలో వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు.

రాజస్థాన్

గుర్జార్‌ సామాజిక వర్గాన్ని ఆకర్షించడానికేనా?

ప్రధాని మోదీ రాజస్థాన్‌ పర్యటనలో ఎలాంటి రాజకీయ కోణం లేదని బీజేపీ చెబుతోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ పర్యటన బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తుందని విశేషకులు భావిస్తున్నారు. తూర్పు రాజస్థాన్‌లోని మెజార్టీ అసెంబ్లీ స్థానాల్లో గుర్జార్ వర్గం గెలుపోటములను శాసిస్తుంది. గుర్జార్‌ సామాజిక వర్గానికి చెందిన సచిన్ పైలట్‌ను ముఖ్యమంత్రిగా చేయనందున ఆ వర్గం కాంగ్రెస్ పట్ల నిరాశతో ఉన్నారని బీజేపీ భావిస్తోంది. గుర్జార్ వర్గం ఆరాధ్య దైవం దేవ్‌నారాయణ్‌ జయంతికి ప్రధాని మోదీ రావడం వల్ల ఆ సామాజిక వర్గం బీజేపీకి అనుకూలంగా మారే అవకాశం ఉంటుందని కమల దళం ఆశిస్తోంది. దేవనారాయణ్ జయంతి సందర్భంగా ఆలయంలో ప్రధాని ప్రత్యేక ప్రార్థనలు చేసి మొక్కను నాటనున్నారు. అనంతరం సభలో కూడా ప్రసంగిస్తారు.