గణతంత్ర వేడుకలు: ప్రత్యేక ఆకర్షణగా ప్రధాని మోదీ తలపాగా- దేశంలో వైవిధ్యానికి ప్రతీక
74వ గణతంత్ర వేడుకల వేళ ప్రధాని మోదీ తలపాగా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. మోదీ ప్రధాని అయినప్పటి నుంచి స్వాతంత్య్ర, రిపబ్లిక్ వేడుకల సందర్భంగా ఆయన వస్త్రాధారణ హైలెట్‌గా నిలుస్తోంది. ముఖ్యంగా మోదీ ధరించే తలపాగా స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. ఈ సారి మోదీ విభిన్న రంగులతో కూడిన రాజస్థానీ తలపాగాను ధరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే నల్లటి కోటు, తెల్లటి ప్యాంటుతో పాటు తెల్లటి కుర్తా ధరించారు. అంతేకాకుండా మెడలో తెల్లటి స్టోల్ వేసుకున్నారు. దేశంలోని వైవిధ్యానికి ప్రతీకగా, భిన్న సంస్కృతులకు ప్రతిబింబంగా నిలుస్తోందన్న ఉద్దేశంతోనే మోదీ రాజస్థానీ తలపాగాను ధరించినట్లు తెలుస్తోంది.
ప్రతి ఏటా ఆనవాయితీగా రాష్ట్రాల సంస్కృతి ప్రతిబింబించేలా..
ప్రతి ఏటా స్వాతంత్య్ర , రిపబ్లిక్ వేడుకల సందర్భంగా ఏదో ఒక రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రధాని మోదీ వస్త్రాధారణ ఉంటుంది. ఉదయం ప్రధాని మోదీ జాతీయ యుద్ధ స్మారకం వద్దకు రాగానే మీడియా ఆయన వస్త్రాధారణపై ఫోకస్ పెట్టింది. నేషనల్ వార్ మెమోరియల్ వద్ద నివాళులర్పించి అక్కడి నుంచి గణతంత్ర దినోత్సవ పరేడ్‌ను చూసేందుకు ప్రధాని మోదీ కర్తవ్యపథ్‌కు వెళ్లారు. 2022లో జరిగిన రిపబ్లిక్ వేడుకల్లో ప్రధాని మోదీ ఉత్తరాఖండ్ సాంప్రదాయ టోపీని ధరించారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర పుష్పం బ్రహ్మ కమలం చిహ్నాన్ని ఆ టోపీపై ముద్రించడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే మణిపూర్ కండువాను కూడా ధరించారు. 2021లో జామ్‌నగర్ తలపాగాను ప్రధాని మోదీ ధరించారు.