Sthri Sakthi: స్త్రీశక్తి పథకం కింద 47 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు: మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి
ఈ వార్తాకథనం ఏంటి
స్త్రీశక్తి ఉచిత బస్సు పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలు భారీ స్థాయిలో ప్రయోజనం పొందుతున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ఈపథకం అమలు ప్రారంభమైనప్పటి నుంచి మహిళలు మొత్తం 47కోట్ల ప్రయాణాలు చేసినట్లు ఆయన తెలిపారు. ఈకార్యక్రమం విజయవంతంగా కొనసాగేందుకు ప్రభుత్వం రూ.1,660కోట్లను కేటాయించిందని వివరించారు. స్త్రీశక్తి పథకం అమలుకు ప్రత్యేకంగా 9,500బస్సులను వినియోగిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. బుధవారం అసెంబ్లీలో రవాణాశాఖ గ్రాంట్లపై జరిగిన చర్చకు సమాధానంగా మాట్లాడిన ఆయన, దివ్యాంగులకు కూడా ఆర్టీసీబస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. విద్యాశాఖమంత్రి నారా లోకేశ్ సూచనల మేరకు విద్యార్థులు హాల్ టికెట్లు చూపించి పరీక్షా కేంద్రాలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా వెళ్లే అవకాశాన్ని కల్పించామని చెప్పారు.
వివరాలు
2,700 కొత్త బస్సులు
ఆటోడ్రైవర్ సేవ పథకం కింద వాహనాల మరమ్మతుల కోసం 2,90,699 మంది డ్రైవర్లకు ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున మొత్తం రూ.436కోట్ల ఆర్థిక సహాయం అందించామని,ఈ సహాయాన్ని ప్రతి ఏడాది కొనసాగిస్తామని మంత్రి వెల్లడించారు. ట్రాక్టర్లకు దమ్ము చక్రాలు అమర్చి రహదారులపై నడపడం వల్ల రోడ్లు దెబ్బతింటున్నాయని గుర్తించి, దీనిపై రవాణాశాఖ అధికారులకు అవసరమైన మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ బలోపేతానికి 2,700 కొత్త బస్సులు కొనుగోలు చేయనున్నామని చెప్పారు. అదనంగా పీఎం ఈ-బస్ సేవ పథకం ద్వారా రాష్ట్రానికి మరో 750ఆధునిక బస్సులు రానున్నాయని వివరించారు. ప్రస్తుతం 9 ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లు పనిచేస్తుండగా,సీఎస్‌ఆర్ కింద మారుతీ సుజుకి సంస్థ మరో 5 ట్రాక్‌లను ఏర్పాటు చేయనుందని తెలిపారు.
వివరాలు
18 జిల్లాల్లో ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు
అలాగే 18 జిల్లాల్లో ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు పనిచేస్తున్నాయని, మిగిలిన జిల్లాల్లో కూడా త్వరలో ప్రారంభించనున్నట్లు మంత్రి చెప్పారు. స్త్రీశక్తి పథకాన్ని మహిళలు విస్తృతంగా వినియోగిస్తున్నారని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్. ఈశ్వరరావు అభిప్రాయపడ్డారు. ఈ పథకానికి బడ్జెట్‌లో కూడా గణనీయమైన నిధులు కేటాయిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వం పల్లెవెలుగు బస్సుల సంఖ్యను తగ్గించిందని విమర్శించిన ఆయన, వాటిని మళ్లీ పెంచాలని కోరారు. పాత ఇంద్ర బస్సుల స్థానంలో కొత్త బస్సులు ప్రవేశపెట్టాలని సూచించారు.
వివరాలు
నియోజకవర్గానికి ఒక వాహనాల ఫిట్‌నెస్ స్టేషన్ ఏర్పాటుకు విజ్ఞప్తి
ఇక ఆర్టీసీ నుంచి రిటైరైన ఉద్యోగులకు ప్రస్తుతం కేవలం రూ.1,000 పింఛనే అందుతోందని, అయితే ప్రభుత్వం సామాజిక పింఛన్ల కింద రూ.4,000 చొప్పున ఇస్తోందని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు తగిన న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా వాహనాల ఫిట్‌నెస్ పరీక్షల కోసం ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లు ప్రస్తుతం జిల్లాకు ఒక్కటే ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రతి నియోజకవర్గానికి ఒక స్టేషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.