T20 World Cup 2026: సెమీస్ రేసు నుంచి లంక ఔట్.. కివీస్ ఘన విజయం
ఈ వార్తాకథనం ఏంటి
ఆతిథ్య జట్టుకు భారీ షాక్ తగిలింది. సూపర్-8 దశలో ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే శ్రీలంక టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ ఆశలు ఆవిరయ్యాయి. బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన గ్రూప్-2 మ్యాచ్‌లో కీలక దశలో పరుగులు అదుపు చేయలేకపోయిన లంక.. ఛేదనలోనూ పూర్తిగా విఫలమై 61 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. శాంట్నర్ 26 బంతుల్లో 47 (2 ఫోర్లు, 4 సిక్స్‌లు),రచిన్ రవీంద్ర 22 బంతుల్లో 32 (3 ఫోర్లు, 1 సిక్స్), మెకాంకీ 23 బంతుల్లో అజేయంగా 31 (3 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో రాణించారు. లంక తరఫున తీక్షణ 3/30, చమీర 3/38తో మెప్పించారు.
వివరాలు
రచిన్ స్పిన్ మాయాజాలం
అయితే లక్ష్య ఛేదనలో రచిన్ రవీంద్ర 4/27, హెన్రీ 2/3, శాంట్నర్ 1/19తో బౌలింగ్‌లో విజృంభించడంతో శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 107 పరుగులకే పరిమితమైంది. కమిందు మెండిస్ 23 బంతుల్లో 31 (4 ఫోర్లు),వెల్లలాగే 23 బంతుల్లో 29 (2 ఫోర్లు, 1 సిక్స్)మాత్రమే పోరాటం చూపించారు. పిచ్ అనుకూలంగానే ఉన్నా,లక్ష్యం కూడా అంత పెద్దది కాకపోయినా శ్రీలంక ఆరంభం నుంచే ఒత్తిడిలో పడింది. తొలి బంతికే నిశాంక ఖాతా తెరవకుండానే ఔటవ్వడం జట్టుకు గట్టి దెబ్బైంది.అసలంక కూడా 5 పరుగులకే వెనుదిరిగాడు. ఈ రెండు వికెట్లు పేసర్ హెన్రీ దక్కించుకున్నాడు.అనంతరం కుశాల్ మెండిస్ (11), పవన్ రత్నాయకే (10) వికెట్ల పతనాన్ని కొంతసేపు ఆపినా వేగంగా పరుగులు సాధించలేకపోయారు.
వివరాలు
రవీంద్ర దెబ్బకు క్యూ కట్టిన లంక బ్యాటర్లు
రక్షణాత్మకంగా ఆడడంతో అవసరమైన రన్‌రేట్ క్రమంగా పెరిగిపోయింది. ఎనిమిది ఓవర్లకు 27/2తో లంక వెనుకబడింది. తరువాత పరిస్థితి మరింత దిగజారింది. స్పిన్నర్ రచిన్ రవీంద్ర వరుసగా దెబ్బకొట్టడంతో లంక బ్యాటర్లు క్రమంగా పెవిలియన్ బాట పట్టారు. తొలుత 9వ ఓవర్లో కుశాల్, పవన్‌లను ఔట్ చేసిన రచిన్... ఆపై శానక (3), హేమంత (3) వికెట్లను కూడా కూలదోసి మ్యాచ్‌ను న్యూజిలాండ్ వైపు తిప్పేశాడు. కాసేపు క్రీజ్‌లో నిలిచిన కమిందు మెండిస్ కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. చివర్లో వెల్లలాగే చేసిన ప్రయత్నం ఓటమి తేడాను తగ్గించడానికే ఉపయోగపడింది. లంక ఇన్నింగ్స్‌లో 17 ఓవర్లను న్యూజిలాండ్ స్పిన్నర్లతోనే పూర్తి చేయించడం గమనార్హం.
వివరాలు
కివీస్ మెరుగ్గా...
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ఒడిదుడుకులతో సాగింది. ఒక దశలో 30/0గా దూసుకెళ్లిన కివీస్... తర్వాత 84/6తో తీవ్ర ఒత్తిడిలో పడింది. అయినప్పటికీ చివరికి 168/7తో గట్టి స్కోరు సాధించింది. ప్రారంభంలో అలెన్ 13 బంతుల్లో 23 (3 ఫోర్లు, 1 సిక్స్)తో దూకుడుగా ఆడుతూ ఓవర్‌కు పది పరుగుల రేటుతో స్కోరు పెంచాడు. అయితే తీక్షణ, చమీర చక్కటి బౌలింగ్‌తో మ్యాచ్ చిత్రాన్ని మార్చేశారు. అలెన్, సీఫర్ట్ (8) వరుస ఓవర్లలో ఔటయ్యారు. రచిన్ రవీంద్ర, ఫిలిప్స్ (18) కొంతసేపు నిలిచినా... స్వల్ప వ్యవధిలో ఫిలిప్స్, రచిన్, చాప్‌మన్ (0), మిచెల్ (3) వికెట్లు పడిపోవడంతో కివీస్ 84/6తో ఇబ్బందుల్లో చిక్కుకుంది.
వివరాలు
కివీస్ మెరుగ్గా...
ఆ సమయంలో లంక బౌలర్ల దూకుడు చూస్తే న్యూజిలాండ్ వంద పరుగులు దాటుతుందా అనే సందేహం కలిగింది. కానీ కెప్టెన్ శాంట్నర్,మెకాంకీ కలిసి మ్యాచ్ గమనాన్ని పూర్తిగా మార్చేశారు. చమీర వేసిన 17వ ఓవర్లో మెకాంకీ రెండు సిక్స్‌లు, ఒక ఫోర్ బాదడంతో స్కోరు వేగం పెరిగింది. తర్వాతి ఓవర్లో శాంట్నర్ తీక్షణ బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు, ఒక ఫోర్ కొట్టి మరింత ఊపు తెచ్చాడు. ఈ జంట దూకుడుతో 19వ ఓవర్లో 19 పరుగులు, చివరి ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. ఫలితంగా కివీస్ స్కోరు 160 దాటింది. ఇన్నింగ్స్ చివరి బంతికి శాంట్నర్ ఔటయ్యాడు. ముఖ్యంగా చివరి నాలుగు ఓవర్లలోనే న్యూజిలాండ్ 70 పరుగులు సాధించడం మ్యాచ్‌లో మలుపుగా మారింది.
వివరాలు
సెమీస్ సమీకరణాలు
ఈ ఓటమితో రెండు మ్యాచ్‌ల్లోనూ పరాజయం చెందిన శ్రీలంక సెమీఫైనల్ రేసు నుంచి తప్పుకుంది. లంకపై భారీ విజయంతో న్యూజిలాండ్ అవకాశాలు మెరుగుపర్చుకుంది. పాకిస్థాన్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దుకావడంతో పాయింట్లు పంచుకున్న కివీస్ ఖాతాలో ప్రస్తుతం 3 పాయింట్లు ఉన్నాయి. ఒక మ్యాచ్ రద్దై, మరో మ్యాచ్‌లో ఓడిన పాకిస్థాన్ 1 పాయింట్‌తో మూడో స్థానంలో ఉంది. ఈ గ్రూప్ నుంచి ఇంగ్లాండ్ ఇప్పటికే సెమీస్ చేరింది.శుక్రవారం న్యూజిలాండ్-ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్,శనివారం పాకిస్థాన్-శ్రీలంక పోరు జరగనుంది.
వివరాలు
ఇంగ్లాండ్‌పై న్యూజిలాండ్ గెలిస్తే..
ఇంగ్లాండ్‌పై న్యూజిలాండ్ గెలిస్తే 5 పాయింట్లతో నేరుగా సెమీస్‌కు చేరుతుంది. ఒకవేళ ఓడినా మెరుగైన రన్‌రేట్ (3.050) కారణంగా కివీస్‌కు అవకాశం ఉంటుంది. పాకిస్థాన్ రన్‌రేట్ (-0.461)తో పోలిస్తే ఇది చాలా మెరుగైనది. పాక్ సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ముందుగా ఇంగ్లాండ్ చేతిలో న్యూజిలాండ్ ఓడాలి. అదేకాలంలో లంకపై భారీ తేడాతో గెలవాల్సిన పరిస్థితి ఉంది.
వివరాలు
స్కోర్ వివరాలు
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: సీఫర్ట్ (సి) కమిందు మెండిస్ (బి) చమీర 8; అలెన్ (సి) అండ్ (బి) తీక్షణ 23; రచిన్ రవీంద్ర (సి) హేమంత (బి) తీక్షణ 32; ఫిలిప్స్ (బి) చమీర 18; మిచెల్ (బి) వెల్లెలాగె 3; చాప్‌మన్ (బి) తీక్షణ 0; శాంట్నర్ (సి) అసలంక (బి) చమీర 47; మెకాంకీ నాటౌట్ 31; ఎక్స్‌ట్రాలు 6 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 168;
వివరాలు
స్కోర్ వివరాలు
శ్రీలంక ఇన్నింగ్స్: నిశాంక (బి) హెన్రీ 0; కుశాల్ మెండిస్ (స్టంప్డ్) సీఫర్ట్ (బి) రచిన్ 11; అసలంక (సి) మిచెల్ (బి) హెన్రీ 5; పవన్ రత్నాయకే (స్టంప్డ్) సీఫర్ట్ (బి) రచిన్ 10; కమిందు మెండిస్ (సి) ఫిలిప్స్ (బి) శాంట్నర్ 31; శానక (సి) అలెన్ (బి) రచిన్ 3; హేమంత (సి) మిచెల్ (బి) రచిన్ 3; వెల్లలాగే (సి) రచిన్ (బి) ఫిలిప్స్ 29; చమీర నాటౌట్ 7; తీక్షణ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 7 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 107