74వ గణతంత్ర వేడుకలు: కర్తవ్యపథ్‌లో అంబరాన్నంటిన సంబరాలు
దేశవ్యాప్తంగా 74వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాని మోదీ జాతీయ యుద్ధ స్మారకం వద్ద నివాళితో గణతంత్ర వేడుకలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. దిల్లీలోని కర్తవ్యపథ్‌లో రిపబ్లిక్ డే వేడుకల సంబరాలు అంబరాన్నంటాయి. కర్తవ్యపథ్‌లో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముతో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సీసీ హాజరయ్యారు. రాష్ట్రపతి ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రిపబ్లిక్ డే పరేడ్ కోసం ఎంపిక చేసిన వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాలను ప్రదర్శించారు. కర్తవ్యపథ్‌లో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కర్తవ్యపథ్‌లో మొదటిసారిగా గణతంత్ర వేడుకలు నిర్వహించారు. గతేడాది సెప్టెంబర్ 8న కర్తవ్యపథ్‌ని మోదీ ప్రారంభించారు.
దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోదీ
దేశ ప్రజలకు ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్ర పోరాటంలో అమరులైన వీరల కలలను నెరనేర్చేందుకు అందరం ఐక్యంగా ముందుకు సాగాలన్నారు మోదీ. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కాలంలో జరుగుతున్న ఈ వేడకలు మరింత ప్రత్యేకమని ప్రధాని మోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు. కర్తవ్యపథ్‌లో రిపబ్లిక్ డే వేడుకల కోసం భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. పారామిలటరీ బలగాలు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జి), ఢిల్లీ పోలీసులతో సహా దాదాపు 6,000 మంది సిబ్బందిని భద్రత కోసం మోహరించారు. కర్తవ్యపథ్ పర్యవేక్షణకు దాదాపు 150 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒడిశాతో పాటు అన్ని రాష్ట్రాల్లో గవర్నర్లు జెండాలను ఆవిష్కరించారు.