ఈజిప్టు అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ, కీలక అంశాలపై చర్చలు
జనవరి 26న జరగనున్న గణతంత్ర వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సీసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మూడు రోజుల భారత్ పర్యటనలో భాగంగా బుధవారం భారత్ చేరుకున్న అబ్దెల్ ఫతాహ్.. ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక అంశాలపై చర్చించారు. వాణిజ్య రంగంలో వచ్చే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 12 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలని ఇరుపక్షాలు నిర్ణయించుకున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. భారత్-ఈజిప్ట్ వ్యూహాత్మక భాగస్వామ్యం కింద, రాజకీయ, భద్రత, ఆర్థిక, శాస్త్రీయ రంగాలలో సమగ్ర సహకారం కోసం దీర్ఘకాలిక ఫ్రేమ్‌వర్క్‌పై దృష్టి సారించనున్నట్లు మోదీ పేర్కొన్నారు. భారతదేశం, ఈజిప్టుల రక్షణ పరిశ్రమల మధ్య సహకారంపై ఒక అవగాహనకు వచ్చినట్లు తెలిపారు.
ఐదు కీలక ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు
ఐటీ, సైబర్‌సెక్యూరిటీ, కల్చర్, యూత్ మేటర్స్, బ్రాడ్‌కాస్టింగ్‌లో సహకారం వంటి ఐదు కీలక ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఈ చర్చలు ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వాముల స్థాయికి తీసుకువెళతామని ఇరుదేశాల అధినేతలు ఆశించాయి. తీవ్రవాద నిరోధం, రక్షణ విషయంలో భారత్‌తో కలిసి పనిచేయడానికి ఈజిప్టు ఆసక్తిగా ఉందని అబ్దెల్ ఫతాహ్ చెప్పారు. పర్యాటకాన్ని పెంచేందుకు ఇరు దేశాల మధ్య మరిన్ని విమానాలు నడపాలని సీసీ ప్రతిపాదించారు. ఉగ్రవాద దాడులపై ఈజిప్ట్-భారత్ విచారం వ్యక్తం చేశాయి. మానవాళికి ఉగ్రవాదం పెను ముప్పు వంటిదని, సిమాంతర ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు ఇరు దేశాలు కలిసి కట్టుగా చర్యలు తీసుకోవాలని ప్రధాని చెప్పిన మాటలను సీసీ ఆమోదించారు.