Loading...
Cheeses: స్విట్జర్లాండ్‌ అధ్యక్షుడికి మోదీ గిఫ్ట్‌.. భారతీయ చీజ్‌ల ప్రత్యేకత ఇదే
స్విట్జర్లాండ్‌ అధ్యక్షుడికి మోదీ గిఫ్ట్‌.. భారతీయ చీజ్‌ల ప్రత్యేకత ఇదే

Cheeses: స్విట్జర్లాండ్‌ అధ్యక్షుడికి మోదీ గిఫ్ట్‌.. భారతీయ చీజ్‌ల ప్రత్యేకత ఇదే

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 06, 2026
11:26 am

ఈ వార్తాకథనం ఏంటి

స్విట్జర్లాండ్‌ అధ్యక్షుడు గయ్‌ పార్మెలిన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకమైన బహుమతులు అందించారు. దిల్లీలో జరిగిన ఇరువురు నేతల భేటీలో భారతదేశానికి చెందిన మూడు రకాల చీజ్‌లను ఆయనకు బహూకరించారు. గుల్మార్గ్‌, కోణార్క్‌, యెయూర్‌ పేర్లతో ఉన్న ఈ చీజ్‌లు దేశంలో అభివృద్ధి చెందుతున్న సంప్రదాయ చీజ్‌ తయారీకి ప్రతీకలుగా నిలుస్తున్నాయని మోదీ పేర్కొన్నారు. చీజ్‌ అనగానే ప్రపంచవ్యాప్తంగా స్విట్జర్లాండ్‌ గుర్తుకొస్తుంది. అలాంటి దేశ అధ్యక్షుడికి భారతీయ చీజ్‌లను మోదీ బహుమతిగా ఇవ్వడం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. భారతదేశంలోనూ నాణ్యమైన, సంప్రదాయ పద్ధతుల్లో చీజ్‌ తయారీ అభివృద్ధి చెందుతోందన్న విషయాన్ని ఈ బహుమతులు చాటుతున్నాయి.

వివరాలు 

గుల్మార్గ్‌ చీజ్‌.. 'సూపర్‌ గోల్డ్‌'

గుల్మార్గ్‌ చీజ్‌ను ఫ్రెంచ్‌ శైలిలో తయారు చేస్తారు. పాశ్చరైజ్‌ చేసిన ఆవు పాలతో దీనిని రూపొందిస్తారు. నాణ్యతకు గుర్తింపుగా 2026లో బ్రెజిల్‌లో నిర్వహించిన చీజ్‌ పోటీల్లో గుల్మార్గ్‌కు 'సూపర్‌ గోల్డ్‌' అవార్డు దక్కింది.

కోణార్క్‌ ప్రత్యేకత ఇదే

కోణార్క్‌ చీజ్‌ ఫ్రెంచ్‌ టామ్‌ చీజ్‌ తరహాలో ఉంటుంది. సహజమైన పైపొర, మృదువైన ఆకృతి, నిమ్మపండును తలపించే రుచి దీని ప్రత్యేకతలు.

అంతర్జాతీయ స్థాయిలోనూ దీనికి గుర్తింపు లభించింది. 2023లో నార్వేలో జరిగిన వరల్డ్‌ చీజ్‌ అవార్డ్స్‌లో గోల్డ్‌ అవార్డును సొంతం చేసుకుంది.

2025లో స్విట్జర్లాండ్‌లో జరిగిన పోటీల్లో సిల్వర్‌ అవార్డును అందుకుంది.

వివరాలు 

యెయూర్‌.. స్విస్‌ చీజ్‌ స్ఫూర్తితో

మూడో రకం యెయూర్‌ చీజ్‌. స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రసిద్ధ గ్రుయెర్‌ చీజ్‌ స్ఫూర్తితో దీన్ని తయారు చేస్తారు.

ఇది మౌంటెయిన్‌ తరహా చీజ్‌. ప్రత్యేకమైన రుచి, ఆకృతిని అందించేందుకు దీనిని ఎనిమిది నుంచి తొమ్మిది నెలల పాటు పక్వానికి ఉంచుతారు.

చీజ్‌లతో పాటు కశ్మీరీ వాల్‌నట్‌ చెక్కతో తయారు చేసిన ప్రత్యేక గోడ ప్యానెల్‌ను కూడా ప్రధాని మోదీ స్విస్‌ అధ్యక్షుడికి బహూకరించారు.

మోదీకి ఆల్ఫోర్న్‌ బహుమతి

మరోవైపు స్విట్జర్లాండ్‌ అధ్యక్షుడు గయ్‌ పార్మెలిన్‌ కూడా ప్రధాని మోదీకి ప్రత్యేక కానుక అందించారు.

స్విట్జర్లాండ్‌ సంప్రదాయ వాయిద్యమైన 'ఆల్ఫోర్న్‌'ను ఆయనకు బహుమతిగా ఇచ్చారు.

ఈ వాయిద్యంపై భారత్‌,స్విట్జర్లాండ్‌ దేశాల జాతీయ జెండాలను ముద్రించారు.బహుమతిగా అందిన ఆల్ఫోర్న్‌ను ప్రధాని మోదీ స్వయంగా ఊదడం విశేషం.

ADVERTISEMENT