PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గుర్తింపు.. సీషెల్స్ అత్యున్నత పర్యావరణ పురస్కారం
ఈ వార్తాకథనం ఏంటి
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ గుర్తింపు లభించింది. సీషెల్స్ ప్రభుత్వం తమ దేశంలోని అత్యున్నత పర్యావరణ పురస్కారమైన 'గార్డియన్ ఆఫ్ ది బ్లూ హోరైజన్' (Guardian of the Blue Horizon) అవార్డును ఆయనకు ప్రదానం చేసింది. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించే చర్యల్లో మోదీ ప్రదర్శించిన నాయకత్వానికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేశారు. అలాగే బ్లూ ఎకానమీ అభివృద్ధి, సముద్ర వనరుల బాధ్యతాయుత వినియోగం, పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన కార్యక్రమాలు, వాతావరణ మార్పులను ఎదుర్కొనే దిశగా ఆయన చేసిన కృషిని సీషెల్స్ ప్రభుత్వం ప్రశంసించింది.
వివరాలు
పర్యావరణ పరిరక్షణను కృషి..
ముఖ్యంగా చిన్న ద్వీప దేశాల అభివృద్ధి, వాతావరణ స్థిరత్వం కోసం భారత్ అందిస్తున్న సహకారాన్ని కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఈ పురస్కారంపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఈ గౌరవాన్ని ఎంతో వినమ్రతతో స్వీకరిస్తున్నానని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కొంటున్న దేశాల ప్రజలకు, భవిష్యత్ తరాల కోసం పర్యావరణ పరిరక్షణను తమ బాధ్యతగా భావించే ప్రతి ఒక్కరికీ ఈ అవార్డును అంకితం చేస్తున్నట్లు వెల్లడించారు.
వివరాలు
ఆహార భద్రతను బలోపేతం చేయడమే ధ్యేయం..
ఇదిలా ఉండగా, 2026 మే నెలలో ఆహార భద్రతను బలోపేతం చేయడం, వ్యవసాయ రంగంలో సంస్కరణలు చేపట్టడం, సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో చేసిన కృషికి గుర్తింపుగా ఆహార, వ్యవసాయ సంస్థ (FAO) ప్రధాని మోదీకి 'అగ్రికోలా' పతకాన్ని ప్రదానం చేసింది. అంతకుముందు 2018లో, సుస్థిర ఆర్థికాభివృద్ధి, ప్రపంచ సహకారం, సమ్మిళిత వృద్ధికి అందించిన సేవలకు గుర్తింపుగా ఆయనకు 'సియోల్ శాంతి బహుమతి' లభించింది. అదే ఏడాది వాతావరణ పరిరక్షణ, అంతర్జాతీయ పర్యావరణ సహకారాన్ని బలోపేతం చేయడంలో ఆయన నాయకత్వాన్ని గుర్తిస్తూ, ఐక్యరాజ్యసమితి తన అత్యున్నత పర్యావరణ పురస్కారమైన 'ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు'ను ప్రధాని మోదీకి అందజేసింది.