Loading...
PMJDY accounts: జన్‌ధన్‌ ఖాతాలు 59 కోట్లు దాటాయి.. ఖాతాల్లో మొత్తం ఎంత డబ్బుందంటే?
జన్‌ధన్‌ ఖాతాలు 59 కోట్లు దాటాయి.. ఖాతాల్లో మొత్తం ఎంత డబ్బుందంటే?

PMJDY accounts: జన్‌ధన్‌ ఖాతాలు 59 కోట్లు దాటాయి.. ఖాతాల్లో మొత్తం ఎంత డబ్బుందంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 27, 2026
02:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో ఆర్థిక సేవలను అందరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన (పీఎంజేడీవై) మరో కీలక మైలురాయిని అందుకుంది. దేశవ్యాప్తంగా జన్‌ధన్‌ ఖాతాల సంఖ్య 59 కోట్లు దాటింది. ఈ ఖాతాల్లో మొత్తం రూ.3.17 లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 12 ఏళ్లుగా కొనసాగుతున్న పథకం ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజనను 2014 ఆగస్టు 28న ప్రారంభించారు. ఈ పథకం 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా వివరాలను వెల్లడించింది. పేదలు, బ్యాంకింగ్‌ సేవలకు దూరంగా ఉన్న ప్రజలు, మారుమూల ప్రాంతాల్లో నివసించేవారిని బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి తీసుకురావడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం.

వివరాలు 

గ్రామీణ, సెమీ అర్బన్‌ ప్రాంతాల్లోనే అధికం

జన్‌ధన్‌ ఖాతాల్లో 78 శాతం గ్రామీణ, సెమీ అర్బన్‌ ప్రాంతాల్లోనే ఉన్నాయి. మొత్తం ఖాతాల్లో సుమారు 56 శాతం మహిళల పేరిట కొనసాగుతున్నాయి.

అంటే బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులో లేని వర్గాలకు ఈ పథకం గణనీయంగా చేరువైనట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.

ఒక్కో ఖాతాలో సగటున రూ.5,356

2026 ఆగస్టు 19 నాటికి జన్‌ధన్‌ ఖాతాల్లో ఒక్కో ఖాతాకు సగటున రూ.5,356 డిపాజిట్‌ ఉన్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. గత 12 ఏళ్లలో ఒక్కో ఖాతాలో సగటు డిపాజిట్‌ 3.4 రెట్లు పెరిగింది.

ప్రజలు జన్‌ధన్‌ ఖాతాలను క్రమంగా ఎక్కువగా వినియోగిస్తున్నారని, అదే సమయంలో పొదుపు చేసే అలవాటు కూడా పెరుగుతోందని ఈ పెరుగుదల సూచిస్తోందని కేంద్రం పేర్కొంది.

వివరాలు 

ఉచిత రూపే కార్డు.. రూ.2 లక్షల ప్రమాద బీమా

జన్‌ధన్‌ ఖాతాదారులకు ఉచితంగా రూపే డెబిట్‌ కార్డు అందుతుంది. ఈ కార్డుతో రూ.2 లక్షల వరకు ప్రమాద బీమా సదుపాయం ఉంటుంది.

అత్యవసర ఆర్థిక అవసరాల సమయంలో రూ.10 వేల వరకు ఓవర్‌డ్రాఫ్ట్‌ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది.

జేఏఎం ద్వారా నేరుగా నగదు బదిలీ

జన్‌ధన్‌-ఆధార్‌-మొబైల్‌ (జేఏఎం) వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద అందించే నగదు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరుతోంది.

దీంతో మధ్యవర్తుల ప్రమేయాన్ని తగ్గించడంతో పాటు, ఆర్థిక సాయం అందడంలో జాప్యానికి అవకాశం లేకుండా చేయగలుగుతున్నామని కేంద్రం తెలిపింది.

ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను అర్హులైన వారికి నేరుగా అందించడంలో జేఏఎం వ్యవస్థ కీలకంగా పనిచేస్తోందని పేర్కొంది.

ADVERTISEMENT