Loading...
PoK Polls: పీవోకే ఎన్నికల్లో హింస.. ఒకరి మృతి, పలువురికి గాయాలు
పీవోకే ఎన్నికల్లో హింస.. ఒకరి మృతి, పలువురికి గాయాలు

PoK Polls: పీవోకే ఎన్నికల్లో హింస.. ఒకరి మృతి, పలువురికి గాయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 28, 2026
10:47 am

ఈ వార్తాకథనం ఏంటి

పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో జరిగిన తొలి దశ ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగాయి. పోలింగ్ సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు,రిగ్గింగ్ ఆరోపణలు ఎన్నికల ప్రక్రియపై వివాదాన్ని రేకెత్తించాయి. ఘర్షణల్లో ఒక పార్టీ కార్యకర్త ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. కేంద్రంలో అధికార భాగస్వాములుగా ఉన్న పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్), పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. సోమవారం జరిగిన పోలింగ్ సమయంలో కోట్లి జిల్లాలోని నిక్యాల్ ప్రాంతంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో తమ పార్టీకి చెందిన 35 ఏళ్ల కార్యకర్త ముఖ్తార్ యూనస్‌ను పీఎంఎల్-ఎన్ మద్దతుదారులు కాల్చిచంపారని పీపీపీ ఆరోపించింది.

వివరాలు 

పీపీపీ చైర్మన్ బిలావల్ భుట్టో-జర్దారీ తీవ్ర ఆవేదన

ఈ కాల్పుల్లో మరో ఇద్దరు పార్టీ కార్యకర్తలు గాయపడినట్లు పీపీపీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

ఈ ఘటనపై పీపీపీ చైర్మన్ బిలావల్ భుట్టో-జర్దారీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

శాంతిభద్రతల పరిరక్షణలో సంబంధిత అధికారులు ఎక్కడ ఉన్నారని, ఎన్నికల సంఘం ఈ ఘటనపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

ఇక సింధ్ మంత్రి సయీద్ ఘనీ కూడా ఈ కాల్పుల వెనుక పీఎంఎల్-ఎన్ పాత్ర ఉందని ఆరోపించారు.

పీఎంఎల్-ఎన్ అభ్యర్థి లేదా ఆయన మద్దతుదారులే ఈ ఘటనకు బాధ్యులని తమకు సమాచారం అందినట్లు విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

వివరాలు 

పాక్ సైన్యం కనుసన్నల్లోనే ఎన్నికల ప్రక్రియ జరుగుతోందని తీవ్ర విమర్శలు

పీవోకేలోని భీంబర్, మిర్‌పూర్, కోట్లి జిల్లాలకు చెందిన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొలి దశ పోలింగ్ నిర్వహించారు.

అయితే ఈ ఎన్నికలు కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకు నిర్వహిస్తున్న ప్రక్రియ మాత్రమేనని, తుది ఫలితాలను పాకిస్థాన్ సైన్యం ముందుగానే నిర్ణయించిందని ఓ అధికారి ఆరోపించారు.

భవిష్యత్తులో పీవోకేలో ఎలాంటి నిరసనలు ఉద్భవించకుండా అణచివేయడమే లక్ష్యంగా అక్కడి రాజకీయ వ్యవస్థపై పాకిస్థాన్ సైన్యం పూర్తి నియంత్రణ సాధించేందుకు ప్రయత్నిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

ADVERTISEMENT