LOADING...
Love Across the LoC: ఆన్‌లైన్ ప్రేమ కోసం ఎల్వోసీ దాటిన పీవోకే యువకుడు.. భారత్‌లో అరెస్ట్
ఆన్‌లైన్ ప్రేమ కోసం ఎల్వోసీ దాటిన పీవోకే యువకుడు.. భారత్‌లో అరెస్ట్

Love Across the LoC: ఆన్‌లైన్ ప్రేమ కోసం ఎల్వోసీ దాటిన పీవోకే యువకుడు.. భారత్‌లో అరెస్ట్

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 01, 2026
02:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వద్ద ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)కు చెందిన ఓ యువకుడు సోషల్ మీడియా ద్వారా పరిచయమైన యువతిని కలుసుకునేందుకు ప్రాణాలకు తెగించి ఎల్వోసీ దాటి భారత్‌లోకి ప్రవేశించాడు. అయితే అప్రమత్తంగా ఉన్న భారత సైన్యం అతడిని యూరీ సెక్టార్‌లో అదుపులోకి తీసుకుంది. అధికారుల వివరాల ప్రకారం.. పీవోకేలోని ముజఫరాబాద్ ప్రాంతానికి చెందిన జీషాన్ అహ్మద్ మీర్ (22) ఆదివారం ఉదయం యూరీ సెక్టార్‌లోని సిలికోట్ ప్రాంతం గుండా ఎల్వోసీ దాటే ప్రయత్నం చేశాడు. ఉదయం సుమారు 9.30 గంటల సమయంలో అతడి కదలికలను గమనించిన సైనికులు వెంటనే అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.

వివరాలు 

జీషాన్,యువతిని విచారిస్తున్న అధికారులు 

ప్రాథమిక విచారణలో జీషాన్ తన వద్ద ఉన్న పాకిస్థాన్ గుర్తింపు కార్డును అధికారులకు చూపించాడు. యూరీ ప్రాంతానికి చెందిన ఇరమ్ బానో అనే యువతితో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడిందని, ఆమెను ప్రత్యక్షంగా కలుసుకోవాలనే ఉద్దేశంతో భారత్‌కు వచ్చానని తెలిపాడు. అయితే జీషాన్ చెప్పిన వివరాలను భద్రతా సంస్థలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ప్రస్తుతం అతడితో పాటు సంబంధిత యువతిని కూడా అధికారులు విచారిస్తున్నారు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలు, పరిచయానికి సంబంధించిన వివరాలు, వ్యక్తిగత నేపథ్యాలను పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇది నిజంగా ప్రేమ వ్యవహారమేనా? లేక దీని వెనుక మరేదైనా ఉద్దేశం లేదా కుట్ర ఉందా? అనే కోణంలో విచారణ సాగుతోంది.

వివరాలు 

పీవోకేలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ముగ్గురు యువకులు

మరోవైపు నియంత్రణ రేఖ సమీపంలో మరో ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. హత్‌లంగా-నంబ్లా ప్రాంతంలో ముగ్గురు యువకులు పీవోకేలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా భద్రతా దళాలు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నాయి. పట్టుబడిన వారిని సోపోర్‌కు చెందిన ఆదిల్ హుస్సేన్ దార్, ఇష్ఫాక్ అహ్మద్, జాఫర్ అహ్మద్‌లుగా గుర్తించారు. వీరిలో ఆదిల్ హుస్సేన్ గతంలో టెరిటోరియల్ ఆర్మీ (టీఏ-161)లో పనిచేసి అనంతరం సస్పెండ్ అయినట్లు అధికారులు వెల్లడించారు. నిఘా వర్గాల నుంచి అందిన సమాచారంతో అప్రమత్తమైన సైన్యం, వారు సరిహద్దు ప్రాంతానికి చేరుకునేలోపే అడ్డుకుంది. వీరు పీవోకేకు వెళ్లడానికి కారణమేంటి? ఏదైనా ఉగ్రవాద నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నాయా? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

Advertisement

వివరాలు 

740 కిలోమీటర్ల పొడవున ఎల్వోసీ

జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా, కుప్వారా, పూంచ్ సహా పలు జిల్లాల గుండా సుమారు 740 కిలోమీటర్ల మేర నియంత్రణ రేఖ విస్తరించి ఉంది. చొరబాట్లు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, డ్రోన్ల ద్వారా జరిగే కార్యకలాపాలను అడ్డుకునేందుకు భద్రతా దళాలు ఎల్వోసీ వెంట నిరంతరం గస్తీ నిర్వహిస్తూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.

Advertisement