Loading...
Polavaram: పోలవరం సివిల్‌ పనులు 45.72 మీటర్ల వరకు .. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
పోలవరం సివిల్‌ పనులు 45.72 మీటర్ల వరకు .. కేంద్ర మంత్రి కీలక ప్రకటన

Polavaram: పోలవరం సివిల్‌ పనులు 45.72 మీటర్ల వరకు .. కేంద్ర మంత్రి కీలక ప్రకటన

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 07, 2026
09:32 am

ఈ వార్తాకథనం ఏంటి

పోలవరం ప్రాజెక్టు తొలి దశకు కేంద్ర ప్రభుత్వం అందించే నిధులు 41.15 మీటర్ల నీటి నిల్వ స్థాయి వరకే పరిమితమైనప్పటికీ, ప్రాజెక్టుకు సంబంధించిన సివిల్‌ నిర్మాణ పనులు పూర్తి జలాశయ మట్టం (ఎఫ్‌ఆర్‌ఎల్‌) అయిన 45.72 మీటర్ల వరకు కొనసాగుతాయని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్‌భూషణ్‌ చౌధరి స్పష్టం చేశారు. తొలి దశ పనులను 2027 జూన్‌ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. గురువారం లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

వివరాలు 

రూ.30,436.95 కోట్లకు కేంద్ర ఆమోదం

పోలవరం ఫేజ్‌-1కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన నిధులు, ఇటీవల విడుదల చేసిన మొత్తాలు, 2027 నాటికి 41.15 మీటర్ల వరకు నీటి నిల్వకు అనుగుణంగా పనుల పురోగతి, కేంద్ర గ్రాంట్‌ పరిధి, కాలువల నిర్మాణం, విద్యుత్‌ కేంద్రం, భూసేకరణ, సహాయ-పునరావాస కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక, ఆర్థిక నిబంధనల అమలు, యుటిలైజేషన్‌ సర్టిఫికెట్ల సమర్పణ తదితర అంశాలపై మంత్రి వివరాలు వెల్లడించారు.

2023 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు ఫేజ్‌-1కు, అంటే 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటి నిల్వ సామర్థ్యాన్ని కల్పించే పనుల కోసం రూ.30,436.95 కోట్ల నిధులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి తెలిపారు.

ఈ గ్రాంట్‌లో ఇంకా రూ.12,157.53 కోట్లు విడుదల చేయాల్సి ఉందన్నారు.

వివరాలు 

2027 జూన్‌ నాటికి తొలి దశ పూర్తి లక్ష్యం

ఇందులో 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.5,512.40 కోట్లు, 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.2,810.22 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు.

41.15 మీటర్ల వరకు నీటిని నిల్వ చేయడానికి అవసరమైన ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రస్తుతం సజావుగా కొనసాగుతున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు.

గ్యాప్‌-1, గ్యాప్‌-2 ప్రాంతాల్లో ప్రధాన డ్యాం నిర్మాణంతో పాటు భూసేకరణ, సహాయ,పునరావాస కార్యక్రమాలను 2027 జూన్‌ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు 

గ్రాంట్‌ పరిధి ఇదే.. విద్యుత్‌ కేంద్రం రాష్ట్ర బాధ్యత

కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న గ్రాంట్‌ 41.15 మీటర్ల వరకు నీటి నిల్వకు సంబంధించిన ఫేజ్‌-1 పనులకే వర్తిస్తుందని మంత్రి స్పష్టం చేశారు.

అయితే ఈ దశలోనే ప్రాజెక్టుకు సంబంధించిన సివిల్‌ నిర్మాణ పనులు పూర్తి జలాశయ మట్టం అయిన 45.72 మీటర్ల వరకు చేపడతారని వివరించారు.

అదేవిధంగా 41.15 మీటర్ల వరకు అవసరమైన భూసేకరణ, సహాయ-పునరావాస కార్యక్రమాలు, కుడి, ఎడమ ప్రధాన కాలువల నిర్మాణ పనులు కూడా ఈ గ్రాంట్‌ పరిధిలోకి వస్తాయని తెలిపారు.

అయితే విద్యుదుత్పత్తి కేంద్రం నిర్మాణానికి అయ్యే మొత్తం వ్యయాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

ADVERTISEMENT

వివరాలు 

సకాలంలో పత్రాలు సమర్పిస్తున్న ఏపీ ప్రభుత్వం

ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక పత్రాలు, అవసరమైన నివేదికలు, యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లు తదితర అన్ని డాక్యుమెంట్లను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్రానికి సకాలంలో సమర్పిస్తోందని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్‌భూషణ్‌ చౌధరి వెల్లడించారు.

ADVERTISEMENT