Loading...
Chandrababu: 2027 మార్చికల్లా పోలవరం పూర్తి.. ఆగస్టు 14న ఎడమ కాలువకు నీటి విడుదల: సీఎం చంద్రబాబు
ఆగస్టు 14న ఎడమ కాలువకు నీటి విడుదల: సీఎం చంద్రబాబు

Chandrababu: 2027 మార్చికల్లా పోలవరం పూర్తి.. ఆగస్టు 14న ఎడమ కాలువకు నీటి విడుదల: సీఎం చంద్రబాబు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 14, 2026
10:42 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 2027 మార్చి నాటికి పూర్తిచేసి, గోదావరి జలాలతో నింపిన అనంతరం దేశానికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పోలవరం ఎడమ కాలువ పనులు దాదాపు పూర్తయ్యాయని, ఆగస్టు 14న ఆ కాలువలో నీటిని విడుదల చేస్తామని తెలిపారు. ఆ నీరు అనకాపల్లి జిల్లాకు చేరిన సందర్భంగా అక్కడ అఖండ హారతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అలాగే శ్రీశైలం జలాశయంలోకి నీరు చేరిన తర్వాత సెప్టెంబర్ 1న వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభిస్తామని ప్రకటించారు.

వివరాలు 

960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి

సోమవారం పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన సీఎం అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి, మీడియాతో మాట్లాడారు.

పోలవరం వద్ద పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు.

ఈ ప్రణాళిక అమలైతే నిరంతరాయంగా 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుందని చెప్పారు.

జలధార కార్యక్రమం కింద ప్రతి జిల్లాకు రూ.2 కోట్ల చొప్పున నిధులు కేటాయిస్తున్నామని సీఎం తెలిపారు.

ఈ నిధులతో పాటు కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులు, ఇతర సంస్థల భాగస్వామ్యాన్ని వినియోగిస్తూ జలధార కార్యక్రమాలను మరింత విస్తరించాలని అధికారులకు సూచించారు.

వివరాలు 

రెండేళ్లలోనే పనులకు వేగం

పోలవరం ప్రాజెక్టును తాను 37వసారి సందర్శిస్తున్నానని, ఇప్పటివరకు 136 సార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించినట్లు చంద్రబాబు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం అవసరమైన నిధులు అందిస్తూ సహకరిస్తోందని, పోలవరం ప్రాజెక్టు అథారిటీతో పాటు కేంద్ర జల సంఘం కూడా ప్రాజెక్టుకు పూర్తి మద్దతు ఇస్తున్నాయని చెప్పారు.

గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో కేవలం 2 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయని, ప్రస్తుతం తమ ప్రభుత్వం రెండేళ్ల వ్యవధిలోనే అదనంగా 15 శాతం పనులను పూర్తి చేసిందని పేర్కొన్నారు.

ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టుపై రూ.7,043 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు.

ADVERTISEMENT

వివరాలు 

పునరావాసానికి ప్రాధాన్యం

పునరావాస కార్యక్రమాన్ని ఎలాంటి ఫిర్యాదులకు తావు లేకుండా అమలు చేస్తున్నామని సీఎం చెప్పారు.

ఏడు మండలాలతో ప్రత్యేకంగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేశామని గుర్తుచేశారు.

ప్రస్తుతం ప్రాజెక్టు మొత్తం పనుల్లో 89 శాతం పూర్తయ్యాయని, ఇప్పటివరకు 17,500కు పైగా నిర్వాసిత కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వివరించారు.

అలాగే 94,152 ఎకరాల భూసేకరణ పూర్తైందని, 2027 మార్చి నాటికి పునరావాస కార్యక్రమాలను కూడా పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

తొలి దశలో నీటిని నిల్వ చేసే ముందు నిర్వాసిత కుటుంబాలందరినీ పూర్తిగా తరలించే చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.

ADVERTISEMENT

వివరాలు 

తుది దశలో కాలువల పనులు

పోలవరం కుడి కాలువలో ఇంకా 4 శాతం పనులు మిగిలి ఉన్నాయని సీఎం తెలిపారు.

ఎడమ కాలువలో మిగిలిన నిర్మాణాలను పూర్తిచేయడానికి అదనంగా రూ.250 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.

కుడి, ఎడమ కాలువల అనుసంధాన పనులు ప్రస్తుతం 90 శాతం పూర్తయ్యాయని పేర్కొన్నారు.

గత ప్రభుత్వ కాలంలో డయాఫ్రం వాల్ దెబ్బతినడంతో ప్రాజెక్టు భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తమయ్యాయని, అయితే ఇప్పుడు కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి చేసి ప్రాజెక్టును తిరిగి సరైన దిశలోకి తీసుకొచ్చామని తెలిపారు.

దీంతో పోలవరం ప్రాజెక్టు నిర్ణీత గడువులో పూర్తవుతుందనే విశ్వాసం ఏర్పడిందని సీఎం అన్నారు.

వివరాలు 

వెలిగొండ పనులపైనా దృష్టి

వెలిగొండ ప్రాజెక్టు పూర్తికాకముందే గత ప్రభుత్వం దానిని జాతికి అంకితం చేసిందని చంద్రబాబు విమర్శించారు.

టన్నెల్‌లో చిక్కుకున్న టన్నెల్ బోరింగ్ మెషీన్ (TBM)ను కూడా బయటకు తీసుకురాలేదని పేర్కొన్నారు.

అయితే తమ ప్రభుత్వం గత రెండేళ్లలో వెలిగొండ ప్రాజెక్టుపై రూ.2,300 కోట్లు ఖర్చు చేసి పనులను వేగవంతం చేసిందని తెలిపారు.

సెప్టెంబర్ 1న ప్రాజెక్టును ప్రారంభించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

ADVERTISEMENT