Loading...
YS Jagan: పులివెందులలో ఆందోళన.. జగన్‌తో పాటు వైసీపీ నేతలపై కేసులు
పులివెందులలో ఆందోళన.. జగన్‌తో పాటు వైసీపీ నేతలపై కేసులు

YS Jagan: పులివెందులలో ఆందోళన.. జగన్‌తో పాటు వైసీపీ నేతలపై కేసులు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 03, 2026
11:21 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కడప జిల్లా పులివెందులలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ రోజు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ఆందోళనకు దిగారనే ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. జగన్‌తో పాటు కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి,వైఎస్సార్‌సీపీ నేతలు,ఏజెంట్లపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ రోజున ఓటు హక్కు వినియోగించుకునేందుకు జగన్‌ తన సొంత నియోజకవర్గమైన పులివెందులకు వచ్చారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను పోలింగ్‌ కేంద్రాల్లోకి అనుమతించడం లేదని ఆరోపిస్తూ పార్టీ నేతలు,కార్యకర్తలతో కలిసి పులివెందుల ఆర్వో కార్యాలయం ఎదుట బైఠాయించారు. తమ ఏజెంట్లను పోలింగ్‌ బూత్‌ల్లోకి రాకుండా అడ్డుకుంటున్నారని నిరసన వ్యక్తం చేశారు.

వివరాలు 

పులివెందులలో రీపోలింగ్‌ నిర్వహించాలని డిమాండ్

ఈ క్రమంలో ఆర్వో జగన్‌ నుంచి వినతిపత్రాన్ని స్వీకరించారు.

రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ అపహాస్యమైందని, ప్రజాస్వామ్యాన్ని దారుణంగా ఖూనీ చేస్తున్నారని జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పులివెందులలో రీపోలింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

పోలింగ్‌ కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను అనుమతించడం లేదని, టీడీపీ నేతలు పోలింగ్‌ బూత్‌లను ఆక్రమించారని ఆరోపించారు.

పోలీసులు, అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

మాజీ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయని జగన్‌ వ్యాఖ్యానించారు.

అధికార పార్టీ నేతలు ఏం చేసినా మరో రెండేళ్లే అని, ఆ తర్వాత తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అన్నారు.

అప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడటంతో పాటు ఈ ఘటనలపై విచారణ జరిపిస్తామని చెప్పారు.

వివరాలు 

ఓటు వేయకుండానే బెంగళూరుకు జగన్

ఇలాంటి పరిస్థితులు కొనసాగితే భవిష్యత్తులో ఎన్నికలు జరగని పరిస్థితి వస్తుందని జగన్‌ హెచ్చరించారు.

తాను పిలుపునిచ్చి ఉంటే ఈ ఎన్నికలే ఆగిపోయేవని, అయితే ప్రజాస్వామ్యంపై గౌరవంతో అలా చేయలేదని స్పష్టం చేశారు.

అనంతరం జగన్‌ ఓటు వేయకుండానే బెంగళూరుకు వెళ్లిపోయారు. పులివెందులలో రీపోలింగ్‌కు అనుమతిస్తే తిరిగి వచ్చి ఓటు వేస్తానని తెలిపారు.

ADVERTISEMENT