కత్తులతో మార్కెట్‌లో వ్యక్తి వీరంగం, షూట్ చేసిన పోలీసులు
కర్నాటకలోని కలబురగిలో ఒక వ్యక్తి కత్తులతో వీరంగం సృష్టించారు. మార్కెట్ ప్రాంతంలో సాధారణ ప్రజలపై దాడి చేస్తానని బెదిరిస్తున్న అతడిపై పోలీసులు కాల్పులు జరిపారు. కలబురగి మార్కెట్‌లో ఫజల్ భగవాన్ అనే నిందితుడు చేతిలో కత్తులు, పదునైన ఆయుధాలతో సంచరిస్తూ కనిపించాడు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిపై దాడికి యత్నించాడు. ఆత్మరక్షణ , ప్రజల భద్రత కోసం పోలీసు అధికారులు అతని కాలుపై షూట్ చేసి గాయపరిచారు. అనంతరం అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు కలబురగి పోలీస్ కమిషనర్ చేతన్ వెల్లడించారు.
చికిత్స అందించిన తర్వాత అరెస్టు
ఘటనకు సంబంధించిన వివరాలను కలబురగి పోలీస్ కమిషనర్ చేతన్ వివరించారు. పోలీసు సిబ్బందిపై దాడికి యత్నించినందుకే అతడిపై కాల్పులు చేసినట్లు వెల్లడించారు. అతడిని ఆసుపత్రికి తరలించామని, నిందితుల వివరాలను ఇంకా సేకరించాల్సి ఉందన్నారు. పూర్తి వివరాలను సేకరించిన తర్వాత వెల్లడిస్తామని కమిషనర్ చెప్పారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసి, గాయాలకు చికిత్స అందించిన తర్వాత అరెస్టు చేశారు. ఫజల్ భగవాన్‌కు మానసిక స్థితి బాగా లేకనే ఈ వ్యవహరించిన ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.