Sonia Gandhi: నన్ను చూస్తే మోదీ చూపు తిప్పుకుంటారు: సోనియా గాంధీ
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తనకున్న పరిచయం, ఆయనతో జరిగిన సంభాషణల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మోదీని కలిసినప్పుడు ఆయన తన కళ్లలోకి నేరుగా చూడకుండా మరోవైపు చూస్తారని పేర్కొన్నారు. అధికారిక కార్యక్రమాల్లో ఎదురుపడినప్పుడు పరస్పరం నమస్కరించుకోవడం మినహా ఇద్దరి మధ్య పెద్దగా మాటలు ఉండవని తెలిపారు. ఈ వివరాలను తన తాజా పుస్తకం 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్'లో ప్రస్తావించారు. మోదీ ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టి 12 ఏళ్లకు పైగా గడిచిందని, ప్రస్తుతం ఆయన మూడోసారి ఆ పదవిలో కొనసాగుతున్నారని సోనియా గాంధీ తన పుస్తకంలో పేర్కొన్నారు. అయినప్పటికీ ఇప్పటివరకు ఆయనతో తనకు నిజమైన వ్యక్తిగత పరిచయం ఏర్పడలేదని వెల్లడించారు.
వివరాలు
ఎదురుపడితే నమస్కారంతోనే పలకరింపు
పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత స్పీకర్ ఛాంబర్‌లో వివిధ పార్టీలకు చెందిన నాయకులు సమావేశమవుతుంటారని సోనియా వివరించారు.
అలాంటి సందర్భాల్లో మోదీ ఎదురుపడితే ఇద్దరం మర్యాదపూర్వకంగా నమస్కరించుకుంటామని తెలిపారు.
గతంలో రాజకీయంగా భిన్నమైన పార్టీలకు చెందిన నాయకుల మధ్య కూడా స్నేహపూర్వక సంబంధాలు ఉండేవని గుర్తుచేశారు.
అయితే ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
అధికారిక కార్యక్రమాల్లో పలకరింపులు మినహా మోదీతో ఎప్పుడూ పెద్దగా మాట్లాడలేదని సోనియా వెల్లడించారు.
అయితే పుట్టినరోజులు, నూతన సంవత్సర సందర్భాల్లో మాత్రం ఇద్దరం పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకునేవారమని చెప్పారు.
దేశం పట్ల మోదీ ఆలోచనలు, తన అభిప్రాయాలు పూర్తిగా భిన్నమైన రాజకీయ దృక్పథాలకు చెందినవని పేర్కొన్నారు.
వివరాలు
తన ఆరోగ్యం గురించి మోదీ ఆరా తీసేవారని వెల్లడి
తాను ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం తిరిగి వచ్చిన సందర్భాల్లో మోదీ తన ఆరోగ్యం గురించి ఆరా తీసేవారని సోనియా తెలిపారు.
'బాగున్నారా?' అని మోదీ అడిగినప్పుడు.. 'బాగున్నాను.. ధన్యవాదాలు' అని సమాధానం ఇచ్చేదానినని తన పుస్తకంలో రాసుకొచ్చారు.
సోనియా గాంధీ రచించిన 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' పుస్తకం నేటి నుంచి పాఠకులకు అందుబాటులోకి వచ్చింది.