Draupadi Murmu: మంగళగిరి ఎయిమ్స్‌కు రాష్ట్రపతి.. మంగళగిరి వైపు వాహనదారులకు పోలీసులు హెచ్చరిక
మంగళగిరి ఎయిమ్స్‌లో మొదటి స్నాతకోత్సవం ఇవాళ ఘనంగా జరగనుంది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరుకానుండటంతో, ఎయిమ్స్ ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 49 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు రాష్ట్రపతి చేతుల మీదుగా డిగ్రీలను అందజేయనున్నారు. అంతేకాక, పోస్టు డాక్టోరల్ సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసిన నలుగురు విద్యార్థులు బంగారు పతకాలను స్వీకరించనున్నారు. విభజన హామీలలో భాగంగా రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసిన ఈ ఎయిమ్స్ 2020 నుంచి 125 సీట్లతో విద్యా బోధన ప్రారంభించింది.
గౌరవ అతిథిగా అబ్దుల్ నజీర్
స్నాతకోత్సవ వేడుకలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర సహాయ మంత్రి ప్రతాప్ రావ్ గణపత్‌రావ్ జాదవ్, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, సత్యకుమార్ తదితర గౌరవ అతిథులు పాల్గొననున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు రాష్ట్రపతి మంగళగిరి పర్యటన సందర్భంగా ట్రాఫిక్‌కు సంబంధించి ప్రత్యేక ఆంక్షలు విధించబడినట్లు గుంటూరు జిల్లా ఎస్పీ గంగాధరరావు తెలిపారు. డిసెంబర్ 17న ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భారీ వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారు.
మంగళగిరిలో ట్రాఫిక్ ఆంక్షలు
1. చెన్నై నుంచి వైజాగ్ వైపుకు వెళ్లే వాహనాలు : గుంటూరు బుడంపాడు మీదుగా అవనిగడ్డ-పామర్రు-గుడివాడ-హనుమాన్ జంక్షన్ వైపు మళ్లించారు. 2. వైజాగ్ నుంచి ఏలూరు, విజయవాడ, చెన్నై వైపు వెళ్లే వాహనాలు : హనుమాన్ జంక్షన్-గుడివాడ-పామర్రు-అవనిగడ్డ మీదుగా మళ్లించారు. 3. విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్ళే వాహనాలు : తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మీదుగా వెళ్లాలని సూచించారు. వాహనదారులు ఈ మార్గాల హెచ్చరికలను గమనించి పోలీసులకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.