ఎంవీ గంగా విలాస్: ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్‌ను ప్రారంభించిన మోదీ
ప్రపంచంలోనే అతిపొడవైన నదీ యాత్రకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. వారణాసిలో ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్ 'ఎంవీ గంగా విలాస్'ను వర్చువల్‌గా మోదీ జెండా ఊపి ప్రారంభించారు. దేశ పర్యాటక రంగానికి ఊతం ఇచ్చేందుకు ఇది దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే కార్యక్రమంలో ప్రధానమంత్రి వారణాసిలోని టెంట్ సిటీని ప్రారంభించారు. అలాగే.. రూ.1000 కోట్ల విలువైన అనేక ఇతర అంతర్గత జలమార్గాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఈ కార్యక్రమానికి ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మంత్రులు, అధికారులు హాజరయ్యారు.
ప్రత్యేకతలు: 51 రోజులపాటు 3,200 కిలోమీటర్ల ప్రయాణం
'ఎంవీ గంగా విలాస్' క్రూయిజ్ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. 51 రోజులపాటు భారతదేశంలోని ఐదు రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్‌లోని కొన్ని ప్రాంతాల గుండా మొత్తం 3,200 కిలోమీటర్లు ఇది ప్రయాణిస్తుంది. అస్సాంలోని దిబ్రూఘర్ దీని చివరి గమ్యస్థానం. మూడు అంతస్థులు ఉండే ఈ నౌకలో మొత్తం 18సూట్స్ ఉంటాయి. ఒకసారి 36మంది ప్రయాణించవచ్చు. మొత్తం 27నదుల గుండా ఈనౌక ప్రయాణం సాగుతుంది. ఫ్రెంచ్ బాల్కనీలు, ఎల్ఈడీ టీవీలు, స్మోక్ డిటెక్టర్లు, కన్వర్టిబుల్ బెడ్‌లు, రెస్టారెంట్, స్పా వంటి అత్యాధునిక సౌకర్యలు ఇందులో ఉన్నాయి. ఒక్కొక్కరికి టికెట్ ధర రూ.25వేలు కాగా.. తొలి యాత్ర కోసం 32మంది స్విజ్ టూరిస్టులు క్రూయిజ్‌ను మొత్తాన్ని బుక్ చేసుకున్నారు.