జనవరిలోనే సికింద్రాబాద్-విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలెక్కనుందా?
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ త్వరలోనే పట్టాలెక్కనుంది. కాజీపేట మీదుగా సికింద్రాబాద్-విజయవాడ మధ్య ప్రయాణించే ఈ రైలును ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ప్రధాని షెడ్యూల్‌ను బట్టి జనవరిలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవాన్ని నిర్వహించే అవకాశం ఉందని పీఎంఓ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో ఇది ఎన్నికల ఏడాది కావడంతో.. ప్రధానమంత్రి పలుమార్లు ఇక్కడికి వచ్చేందుకు అవకాశం ఉంది. ఈ క్రమంలో తొలిసారి వచ్చినప్పుడు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ మరికొన్ని రైల్వే ప్రాజెక్టులను ఆయన ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఆ మూడు రైల్వే ప్రాజెక్టుల ప్రారంభం కూడా అప్పుడే!
కాజీపేటలో ప్రతిపాదిత పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ వ్యాగన్ వర్క్‌షాప్ కోసం రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఇటీవలే టెండర్‌ను ఖరారు చేసింది. ఆ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి సిద్ధమైంది. సికింద్రాబాద్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ టెండర్ ప్రక్రియ కూడా పూర్తయి.. పనులు ప్రాంరంభించడానికి సిద్ధంగా ఉంది. సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ మధ్య ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రెండో రైల్వే లైన్ నిర్మాణ పనులు కూడా పెండింగ్ లో ఉన్నాయి. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఆవిష్కరణలోనే.. ఈ మూడు రైల్వే ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించే అవకాశం ఉంది. దీని వల్ల అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు ఉంటుంది.. ఎన్నికల ప్రచారంలో అస్త్రంగా ఉపయోగపడుతుందని ఆలోచనలో మోదీ ఉన్నట్లు తెలుస్తోంది.