Page Loader
ప్రధాని నరేంద్ర‌‌మోదీ హైదరాబాద్ పర్యటన వాయిదా
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన వాయిదా

ప్రధాని నరేంద్ర‌‌మోదీ హైదరాబాద్ పర్యటన వాయిదా

వ్రాసిన వారు Stalin
Jan 12, 2023
09:38 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటన వాయిదా పడింది. జనవరి 19న ప్రధాని పలు రైల్వే అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు హైదరాబాద్ రావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల పర్యటన వాయిదా పడినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ప్రధాని పర్యటన ఎప్పుడు ఉంటుందనేది త్వరలో ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్‌స్టేషన్‌ ఆధునీకరణ, సికింద్రాబాద్‌-మహబూబ్‌నగర్‌ మధ్య రైల్వే లైన్‌ డబ్లింగ్‌, కాజీపేట రైల్వే కోచ్‌ వర్క్‌ షాప్‌ పనులతో పాటు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును కూడా ప్రధాని ప్రారంభించనున్నారు.

మోదీ

ఎన్నికల ఏడాదిలో మోదీ పర్యటన ఘనంగా ఉండేలా బీజేపీ ఏర్పాట్లు

తెలంగాణలో ఇది ఎన్నికల ఏడాది కావడంతో.. ప్రధానమంత్రి పలుమార్లు రాష్ట్రానికి వచ్చేందుకు అవకాశం ఉంది. ఈ క్రమంలో ఈ ఏడాది మోదీ తొలి పర్యటన ఘనంగా ఉండేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది. ప్రధాని పర్యటన ఎప్పుడున్నా.. బహిరంగ సభ నిర్వహించేందుకు పరేడ్ గ్రౌండ్స్‌ను బీజేపీ ఇప్పటికే సిద్ధం చేసింది. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీఎం కేసీఆర్.. అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు వస్తున్న ప్రధానికి స్వాగతం పలుకుతారా? లేదా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 2022లో ప్రధాని మోదీ 5సార్లు హైదరాబాద్‌కు వచ్చారు. మోదీ రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా స్వాగతం పలకడానికి కేసీఆర్ వెళ్లకుండా.. మంత్రి తలసాని వంటి సీనియర్లను పంపారు. తద్వారా బీజేపీ పట్ల వ్యతిరేకతను చెప్పకనే చెప్పినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.