Dilli Chalo: ఢిల్లీకి రైతుల పాదయాత్ర.. అంబాలాలో నిషేధాజ్ఞలు
రైతులు మరోసారి తమ హక్కుల కోసం పోరాటానికి సిద్ధమయ్యారు. తమ న్యాయమైన డిమాండ్లను సాధించడానికి పంజాబ్-హర్యానా సరిహద్దులోని శంభు ప్రాంతంలో 'ఢిల్లీ చలో' పేరుతో శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం సహా అనేక డిమాండ్లను నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం ఈ ఉద్యమం ముఖ్య ఉద్దేశం. ఈ క్రమంలో,ఇప్పటికే వేలాది మంది రైతులు శంభు సరిహద్దులో చేరుకున్నారు. రైతు సంఘాలు శంభు- ఖనౌరి సరిహద్దుల నుంచి ఢిల్లీ వరకు పాదయాత్ర చేయాలని పిలుపునిచ్చాయి. అయితే ఖనౌరి సరిహద్దు వద్ద రైతులు తాత్కాలికంగా నిలిచిపోయారు. ఢిల్లీ దిశగా యాత్ర ప్రారంభించాల్సిన తేదీని ఇంకా నిర్ణయించలేదు.
శంభు సరిహద్దు నుంచి పాదయాత్ర
ఈ పరిణామాల వల్ల రాజధాని ఢిల్లీలో ట్రాఫిక్ జామ్ మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. రైతుల ఉద్యమం నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం అప్రమత్తమైంది. సరిహద్దుల్లో కేంద్ర పారా మిలటరీ బలగాలను మోహరించారు. అదనంగా మూడు స్థాయుల బారికేడ్లను ఏర్పాటు చేసి, ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఒకచోట గుమిగూడకుండా నిషేధాజ్ఞలు విధించారు. కిసాన్ మజ్దూర్ మోర్చా సమన్వయకర్త శర్వణ్ సింగ్ పాంథేర్ ప్రకటన ప్రకారం, రైతులు ట్రాక్టర్లు లేదా ఇతర వాహనాల వినియోగం లేకుండా కేవలం కాలినడకన పాదయాత్ర చేస్తారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు 101 మంది రైతులతో శంభు సరిహద్దు నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందని, ఢిల్లీ వరకు ఈ యాత్ర కొనసాగుతుందని తెలిపారు.
సమస్యల పరిష్కారానికి చర్చలకు సిద్ధం: పాంథేర్
రైతుల ఉద్యమానికి ఖాప్ పంచాయతీలు, వ్యాపార వర్గాలు మద్దతు తెలపడం విశేషం. గతంలో, కేంద్ర ప్రభుత్వంతో నాలుగు రౌండ్ల చర్చలు జరిగినప్పటికీ, ఫిబ్రవరి 18 తర్వాత ఎలాంటి చర్చలు జరగలేదని, తమ సమస్యల పరిష్కారానికి చర్చలకు సిద్ధంగా ఉన్నామని పాంథేర్ తెలిపారు. ప్రభుత్వం తమ యాత్రను అడ్డుకుంటే అది తమ ఉద్యమ విజయంగా భావిస్తామని పేర్కొన్నారు.