మణిపూర్: కర్ఫ్యూను దిక్కరించి వీధుల్లోకి వచ్చిన నిరసనకారులు.. రబ్బరు బుల్లెట్లతో కాల్పులు
జాతి హింసతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో మరోసారి ఘర్షణ చెలరేగింది. ప్రజాసంఘాల నిరసనల నేపథ్యంలో బుధవారం చురచంద్రాపూర్, బిష్ణుపూర్‌లో హింసాత్మక వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో కర్ఫ్యూ అమల్లో ఉన్నా ఆందోళనకారులు లెక్కచేయకుండా ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో భద్రతా బలగాలు ఏర్పాటు చేసిన బారికేడ్లను బద్దలు కొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు భద్రతా బలగాలు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు. ఈ ఘటనలో పలువురు నిరసనకారులకు రబ్బరు బుల్లెట్లు తగడంతో గాయపడ్డారు. కుకీ, మైతీ తెగల మధ్య ఘర్షణల కారణంగా మణిపూర్ మే 3 నుంచి హింస జరుగుతోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ హింస కారణంగా రెండు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
అసలేమైంది?
కర్ఫ్యూను ధిక్కరించి మైతీ తెగ అధికంగా ఉండే లోయ ప్రాంతంలోని జిల్లా అయిన బిష్ణుపూర్‌లో నిరసనకారులు మైతీ పౌర సమాజ సమూహాల సంస్థ అయిన కోఆర్డినేషన్ కమిటీ (COCOMI) పిలుపు మేరకు బయటకు వచ్చారు. తాము కుకీలు మెజారిటీగా ఉన్న చురచన్‌పూర్ వరకు పాదయాత్ర చేస్తామని నిరసనకారులు తెలిపారు. దీంతో అనుమతి లేదని భద్రతా దళాలు చెప్పినా ర్యాలీకి ఉపక్రమించారు. ఈ క్రమంలో బిష్ణుపూర్ జిల్లాకు 35 కిలోమీటర్ల దూరంలోని చురచంద్‌పూర్‌లో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులు బారికేడ్లను తొలగించే ప్రయత్నం చేయడగా, నిరసనకారులను అదుపు చేసేందుకు భద్రతా దళాలు కాల్పులు జరిపాయి.