Pune:పెళ్లికి ముందు ఘోరం.. కాబోయే భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసిన యువతి
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మృతి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. మొదట ప్రమాదవశాత్తూ లోయలో పడి మృతి చెందినట్లు నమోదైన ఈకేసు వాస్తవానికి పథకం ప్రకారం చేసిన హత్యగా పోలీసులు తేల్చారు. ఈ కేసులో కేతన్‌కు నిశ్చితార్థమైన సియా గోయల్,ఆమె ప్రియుడు చేతన్ చౌధరిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పుణెకు చెందిన 26 ఏళ్ల కేతన్ అగర్వాల్ ఈ నెల 18న చారిత్రక లోహగఢ్ కోట సమీపంలోని సుమారు 400అడుగుల లోతైన లోయలో పడి మరణించాడు. ఘటన అనంతరం సియా గోయల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో,తన పుట్టినరోజు సందర్భంగా ట్రెక్కింగ్‌కు వెళ్లామని,అక్కడ ఫొటోలు తీస్తున్న సమయంలో కేతన్ హోరుగాలికి సమతుల్యత కోల్పోయి లోయలో పడిపోయాడని తెలిపింది.
వివరాలు
ప్రమాద మృతి కేసును హత్య కేసుగా మార్చి..
అయితే కేసు దర్యాప్తు చేపట్టిన లోనావాలా గ్రామీణ పోలీసులు సియా వాంగ్మూలంలో అనేక అనుమానాస్పద అంశాలను గుర్తించారు. విచారణ సందర్భంగా ఆమె ఇచ్చిన సమాధానాలు పొంతన లేకుండా ఉండటంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో ఆమె మొబైల్ ఫోన్ డేటాను పరిశీలించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దర్యాప్తులో సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌధరి కలిసి కేతన్ అగర్వాల్‌ను లోయలోకి తోసివేసి, ఆ ఘటనను ప్రమాదంగా చూపించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ప్రమాద మృతి కేసును హత్య కేసుగా మార్చిన ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
వివరాలు
పెళ్లికి భారీ ఏర్పాట్లు
పుణె సమీపంలోని గహుంజే ప్రాంతానికి చెందిన కేతన్ అగర్వాల్ తన కుటుంబానికి చెందిన స్థిరాస్తి వ్యాపార సంస్థలో డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. కేతన్, సియా గోయల్‌ల వివాహం నవంబరులో జరగాల్సి ఉంది. ఇందుకోసం కుటుంబ సభ్యులు రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో ఉన్న ఓ ప్యాలెస్‌ను రూ.17 కోట్ల వ్యయంతో బుక్ చేయడమే కాకుండా, అతిథుల రాకపోకల కోసం రెండు విమానాలను కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం.
వివరాలు
కుటుంబ ఒత్తిడితో నిశ్చితార్థం
పోలీసుల వివరాల ప్రకారం, కుటుంబ సభ్యుల కోరికను కాదనలేక సియా గోయల్ కేతన్‌తో నిశ్చితార్థానికి అంగీకరించింది. అయితే ఆమె ఇప్పటికే చేతన్ చౌధరితో ప్రేమ సంబంధంలో ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ నేపథ్యంలో ముందుగానే పథకం వేసుకున్న సియా, చేతన్‌ను లోహగఢ్ కోట ప్రాంతానికి రప్పించి కేతన్ హత్యకు కుట్ర పన్నినట్లు పుణె గ్రామీణ ఎస్పీ సందీప్‌సింగ్ గిల్ తెలిపారు. అంతేకాకుండా, ఈ ఘటనకు ముందు కూడా కేతన్‌ను హత్య చేయడానికి ఇద్దరూ ప్రయత్నించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.