
Punjab: పంజాబ్ విద్యాశాఖ కీలక నిర్ణయం.. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు బోధన ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు భాష బోధనను ప్రారంభించనుంది.
ఈ నిర్ణయాన్ని అమలు చేసే క్రమంలో ఈ నెల 26వ తేదీ నుంచి జూన్ 5వ తేదీ వరకు వేసవి శిబిరాలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.
ఈ శిబిరాల ముఖ్య ఉద్దేశం విద్యార్థులకు కొత్త భారతీయ భాషలలో ప్రాథమిక సంభాషణా నైపుణ్యాలు నేర్పించడమేనని అధికార వర్గాలు తెలిపాయి.
ఈ నేపథ్యంలో తెలుగు భాషను కూడా వేసవి శిబిరాల్లో బోధించనున్నారు. వేసవి శిబిరాల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ విద్యార్థులు పాల్గొననున్నారు.
ఉదయం 8 నుంచి 11 గంటల వరకూ శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపింది.
Details
ఈ నిర్ణయాన్ని తప్పుపట్టిన డెమోక్రటిక్ టీచర్స్ ఫ్రంట్
విద్యార్థులను మూడు గ్రూపులుగా విభజించి ప్రతి గ్రూపునకు మూడు గంటల పాటు తెలుగు బోధన చేయాలంటూ విద్యాశాఖ అధికారిక ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా, పంజాబ్ ప్రభుత్వ ఈ నిర్ణయాన్ని కొంతమంది స్వాగతిస్తుండగా, మరికొంతమంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
పంజాబ్‌లోని డెమోక్రటిక్ టీచర్స్ ఫ్రంట్ (DTF) ఈ నిర్ణయాన్ని తప్పుబడుతోంది.
రాష్ట్రంలో అత్యధిక విద్యార్థులు పంజాబీని మాతృభాషగా కలిగి ఉన్నప్పటికీ, ఇటీవల 12వ తరగతిలో 3,800 మందికి పైగా విద్యార్థులు, 10వ తరగతిలో 1571 మంది విద్యార్థులు జనరల్ పంజాబీలో ఉత్తీర్ణులు కాలేదని డీటీఎఫ్ వెల్లడించింది.
విద్యార్థుల ప్రాథమిక భాషా నైపుణ్యాలను బలోపేతం చేయాల్సిన సమయంలో మరో భాషను బోధించడం విద్యా విధానాన్ని దెబ్బతీసే ప్రమాదముందని డీటీఎఫ్ అభిప్రాయపడింది.