LOADING...
West Asia Crisis: గ్యాస్‌ సంక్షోభ భయం మధ్య కేంద్రం అలర్ట్‌.. ఖతార్‌కు పూరీ, యూఏఈకి జైశంకర్
గ్యాస్‌ సంక్షోభ భయం మధ్య కేంద్రం అలర్ట్‌.. ఖతార్‌కు పూరీ, యూఏఈకి జైశంకర్

West Asia Crisis: గ్యాస్‌ సంక్షోభ భయం మధ్య కేంద్రం అలర్ట్‌.. ఖతార్‌కు పూరీ, యూఏఈకి జైశంకర్

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 09, 2026
01:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇరాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా... దేశంలో ఇంధన కొరతపై ఆందోళనలు మాత్రం తగ్గడం లేదు. ఈ పరిస్థితుల్లో కేంద్రం కీలక చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా గ్యాస్‌ సరఫరాలపై స్పష్టత కోసం కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ, ఖతార్‌ పర్యటనకు సిద్ధమవడం ప్రాధాన్యం సంతరించుకుంది. హర్దీప్‌ సింగ్‌ పూరీ ఈరోజు,రేపు ఖతార్‌లో పర్యటించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ పర్యటనకు సంబంధించిన ఖచ్చితమైన ఉద్దేశాన్ని వెల్లడించలేదు. ఇరాన్‌ ప్రతీకార దాడులకు గురైన గల్ఫ్‌ దేశాల్లో ఖతార్‌ కూడా ఒకటి. ఈ నేపథ్యంలో అక్కడ ఎల్‌ఎన్‌జీ ఉత్పత్తి, ఎగుమతులను తాత్కాలికంగా నిలిపివేశారు. కాల్పుల విరమణ తర్వాత ఉత్పత్తిని మళ్లీ ప్రారంభించాలన్న ఆలోచనలో ఖతార్‌ ఉన్నట్లు సమాచారం.

వివరాలు 

యూఏఈకి జైశంకర్

అయితే భద్రతా కారణాల దృష్ట్యా పూర్తి స్థాయిలో కాకుండా పరిమితంగా కార్యకలాపాలు కొనసాగించాలని అక్కడి అధికారులు భావిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడిస్తోంది. ఈ పరిస్థితుల్లో పూరీ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. జైశంకర్ కూడా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 11, 12 తేదీల్లో ఆయన పర్యటన కొనసాగనున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఇటీవల జరిగిన యుద్ధ పరిస్థితుల్లో ఇరాన్‌ హర్మూజ్‌ జలసంధిని మూసివేయడంతో భారత్‌లో ఎల్‌ఎన్‌జీ సరఫరాలపై ఆందోళనలు పెరిగాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ భయాందోళనలను ఖండించింది. దేశంలో తగినన్ని గ్యాస్‌ నిల్వలు ఉన్నాయని, కొరత వస్తుందనే ప్రచారం అసత్యమని స్పష్టం చేసింది.

Advertisement