CWC Meet: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కుల గణన: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)లో కీలక అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా కుల గణనపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల్లో కుల గణన చేయాలని ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇదొక చారిత్రాత్మక నిర్ణయంగా రాహుల్ అభివర్ణించారు. దేశంలోని మెజార్టీ వర్గాల విముక్తికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని రాహుల్ గాంధీ అన్నారు. మతం లేదా కులం ఆధారంగా పరిగణనలోకి తీసుకోలేదని, భారతదేశంలోని ఆర్థికంగా వెనుకబడిన ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాహుల్ గాంధీ వెల్లడించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలో ఉంది. నవంబర్‌లో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ప్రధాని మోదీ చేయరు, చేయనివ్వరు: రాహుల్
కుల గణనపై కాంగ్రెస్ నిర్ణయానికి భారత కూటమి మద్దతు ఇస్తుందా అని అడిగిన ప్రశ్నకు, ప్రతిపక్ష కూటమిలోని మెజారిటీ పార్టీలు ఈ ఆలోచనకు మద్దతు ఇస్తున్నాయని గాంధీ చెప్పారు. కొన్ని పార్టీలకు సమస్య ఉండవచ్చని, అయితే కాంగ్రెస్‌కు ఆ సమస్య లేదని రాహుల్ అన్నారు. ప్రధానమంత్రి మోదీ కుల గణన చేయడంలో వెనుకంజ వేస్తున్నారన్నారు. నలుగురు కాంగ్రెస్ సీఎంలలో 3 మంది ఓబీసీ వర్గానికి చెందిన వారని, 10మంది బీజేపీ సీఎంలలో ఒక్కరు మాత్రమే ఓబీసీ కి చెందిన వారు ఉన్నారన్నారు. ప్రధాని మోదీ ఓబీసీల కోసం పని చేయరు, ఇంకొకరిని చేయనివ్వరని దుయ్యబట్టారు. కుల గణన కోసం డిమాండ్ చేయడం ప్రజలను విభజించే ప్రయత్నమని ప్రధాని మోదీ వితండవాదం చేస్తున్నారన్నారు.