6నెలల్లోనే హై స్పీడ్ ట్రైన్ వచ్చేస్తుంది.. ప్రకటించిన రైల్వే మంత్రి
భారతీయ రైల్వే రంగంలో చాలా మార్పులు రాబోతున్నాయి. ప్రస్తుతం వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ళు దేశవ్యాప్తంగా చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. మరికొద్ది రోజుల్లో హై స్పీడ్ ట్రైన్ కూడా రాబోతుందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడి చేశారు. గుజరాత్ లోని సనంద్ ప్రాంతంలో సెమీ కండక్టర్ కంపెనీ మైక్రాన్ ప్లాంట్ శంకుస్థాపన కోసం విచ్చేసిన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, హై స్పీడ్ ట్రైన్ గురించి వెల్లడించారు. అహ్మదాబాద్, సనంద్ ప్రాంతాల మధ్య మరో 6 నెలల్లో హై స్పీడ్ ట్రైన్ వచ్చేస్తుందని చెప్పుకొచ్చారు.
5లక్షల కోట్ల రూపాయలకు పెరగనున్న సెమీ కండక్టర్ల డిమాండ్
దేశంలో మొట్టమొదటి హై స్పీడ్ ట్రైన్ అహ్మదాబాద్, సనంద్ ప్రాంతాల మధ్య నడుస్తుందని రైల్వే మంత్రి అన్నారు. అంతే కాదు సనంద్ రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ళు కూడా ఇకనుండి ఆగుతాయని తెలియజేశారు. ఇక సెమీ కండక్టర్ కంపెనీ మైక్రాన్ ప్లాంట్ గురించి మాట్లాడుతూ, రాబోయే కాలంలో సెమీ కండక్టర్ల డిమాండ్ 5లక్షల కోట్లకు పెరుగుతుందని, ప్రధాని మోదీ దార్శనికత వల్ల ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతుందని రైల్వే మంత్రి వ్యాఖ్యానించారు. అదలా ఉంచితే, సెమీ కండక్టర్ కంపెనీ మైక్రాన్ సంస్థ, గుజరాత్ లో 22,140 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.