Indian Railways: రైల్వే క్యాంటీన్లలో నిబంధనల ఉల్లంఘన.. 14 రోజుల ప్రత్యేక డ్రైవ్ ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటకలోని రైల్వే స్టేషన్లలో ఆహార భద్రతపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FSDA) నిర్వహించిన తనిఖీల్లో పలు చోట్ల గడువు ముగిసిన ఆహార పదార్థాలు, అనుమతి లేని రంగుల వినియోగంపై అనుమానాలు, అపరిశుభ్రమైన పరిస్థితులు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు అందించే ఆహారం సురక్షితంగా ఉండేలా సౌత్ వెస్ట్రన్ రైల్వే (SWR) 14 రోజుల ప్రత్యేక ఫుడ్ సేఫ్టీ డ్రైవ్‌ను ప్రారంభించింది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో రైల్వే స్టేషన్లలోని క్యాటరింగ్ యూనిట్లు,ఫుడ్ స్టాల్స్‌లో పరిశుభ్రత,శుభ్రత ప్రమాణాలు,ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) లైసెన్సులు, ఆహార పదార్థాల గడువు తేదీలు, ఆహారాన్ని నిల్వ చేయడం,తయారు చేయడం,విక్రయించే విధానం వంటి అంశాలను అధికారులు పరిశీలించనున్నారు.
వివరాలు
రైల్వే క్యాటరింగ్ యూనిట్లపై నిఘా.. వందల కొద్దీ ఆహార నమూనాల పరీక్షలు
ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం అందుతున్నదా లేదా అనే విషయంపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు.
SWR పరిధిలోని బెంగళూరు, మైసూరు, హుబ్బళ్లి డివిజన్లలో మొత్తం 428 క్యాటరింగ్ సంస్థలను ఈ తనిఖీల పరిధిలోకి తీసుకొచ్చారు.
రైళ్లలో ప్రయాణికులకు అందించే ఆహారాన్ని తయారు చేసే ప్యాంట్రీ కార్లు, బేస్ కిచెన్లను కూడా అధికారులు తనిఖీ చేస్తున్నారు.
2025-26లో రైల్వే ఫుడ్ సేఫ్టీ బృందాలు 1,243 తనిఖీలు నిర్వహించి 528 ఆహార నమూనాలను పరీక్షల కోసం సేకరించాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2026 జూలై వరకు ఇప్పటికే 271 తనిఖీలు నిర్వహించి, 170 ఆహార నమూనాలను పరీక్షలకు పంపినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
వివరాలు
కర్ణాటకలో 36 రైల్వే స్టేషన్లలో తనిఖీలు.. 112 ఫుడ్ సంస్థలపై ఫోకస్
ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించే విక్రేతలపై కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే స్పష్టం చేసింది.
ఉల్లంఘన తీవ్రతను బట్టి షోకాజ్ నోటీసులు జారీ చేయడం, జరిమానాలు విధించడం, ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ల (FBOs) కాంట్రాక్టులను రద్దు చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నారు.
కర్ణాటక FSDA గురువారం రాష్ట్రవ్యాప్తంగా 36 రైల్వే స్టేషన్లలో భారీ తనిఖీలు నిర్వహించిన తర్వాత రైల్వే ఈ ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టింది.
ఈ తనిఖీల్లో రైల్వే క్యాంటీన్లు, హోటళ్లు, ఫుడ్ స్టాల్స్ సహా 112 ఆహార సంస్థలను అధికారులు తనిఖీ చేశారు. కేఆర్ పురం, మైసూరు వంటి రైల్వే స్టేషన్లలో కూడా తనిఖీలు నిర్వహించారు.
వివరాలు
తనిఖీల్లో వెలుగుచూసిన ఆహార భద్రతా ఉల్లంఘనలు
తనిఖీల సమయంలో పలు ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు బయటపడ్డాయి.
సమోసాలను కార్డుబాక్సుల్లో నిల్వ చేసినట్లు, తయారు చేసిన వడలను న్యూస్‌పేపర్లపై ఉంచినట్లు అధికారులు గుర్తించారు.
ఆహార పదార్థాల కోసం ఉపయోగించకూడని ప్లాస్టిక్ బకెట్లలో చట్నీ నిల్వ చేసినట్లు తేలింది.
కొన్ని ఆహార పదార్థాలను కూడా న్యూస్‌పేపర్లలో చుట్టి వినియోగదారులకు అందిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
కొన్ని స్టాల్స్‌లో సరైన లేబుల్స్ లేని స్నాక్ ప్యాకెట్లు కూడా కనిపించాయి.
అలాగే కొన్ని ఆహార విక్రయ కేంద్రాల్లో ఫుడ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించలేదని అధికారులు తెలిపారు.
వివరాలు
జిలేబీ, పెడాల్లో అనుమతిలేని రంగులు.. గడువు ముగిసిన పాలు,పెరుగు గుర్తింపు
కొన్ని ఆహార పదార్థాల్లో అనుమతి లేని రంగులను ఉపయోగిస్తున్నారనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి.
జిలేబీల్లో పసుపు రంగు, ఖోవా పెడాల్లో గులాబీ రంగు ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు.
దీనిపై నిర్ధారణ కోసం ఆహార నమూనాలను సేకరించి ల్యాబొరేటరీ పరీక్షలకు పంపారు.
హావేరి జిల్లాలోని ఓ రైల్వే స్టేషన్‌లో గడువు ముగిసిన నందిని పెరుగు ప్యాకెట్లు, దోడ్లా స్టాండర్డైజ్డ్ మిల్క్ ప్యాకెట్లను అధికారులు గుర్తించారు.
మైసూరు రైల్వే స్టేషన్‌లోని ఆహార తయారీ కేంద్రాల్లో ప్లాస్టిక్ పదార్థాలను ఉపయోగించి ఇడ్లీలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు.
తప్పనిసరిగా ఉండాల్సిన లేబుల్స్ లేని చపాతీ ప్యాకెట్లను కూడా విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
వివరాలు
కేఆర్ పురం హోటల్‌లో ఫంగస్ పట్టిన కూరగాయలు
కేఆర్ పురం రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ హోటల్‌లో ఉల్లిపాయలు, ఇతర కూరగాయలకు ఫంగస్ పట్టినట్లు గుర్తించారు.
అక్కడ అపరిశుభ్రమైన పరిస్థితులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
పలు ఆహార సంస్థల్లో గడువు ముగిసిన ఆహార పదార్థాలను విక్రయిస్తున్న కేసులు కూడా బయటపడ్డాయి. ఈ ఉల్లంఘనలపై ఫుడ్ సేఫ్టీ విభాగం తదుపరి చర్యలు చేపడుతోంది.