Loading...
Train Mobile Charging Ban: రైలు ప్రయాణికులకు అలర్ట్.. రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు ఛార్జింగ్ బంద్
రైలు ప్రయాణికులకు అలర్ట్.. రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు ఛార్జింగ్ బంద్

Train Mobile Charging Ban: రైలు ప్రయాణికులకు అలర్ట్.. రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు ఛార్జింగ్ బంద్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 28, 2026
02:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

రైళ్లలో అగ్నిప్రమాదాల ముప్పును తగ్గించేందుకు రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు రైలు బోగీల్లోని మొబైల్ ఛార్జింగ్ పాయింట్లకు విద్యుత్ సరఫరా నిలిపివేయాలని అన్ని రైల్వే జోన్ల అధికారులను ఆదేశించింది. ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది.

వివరాలు 

తాజా ఉత్తర్వులకు కారణమిదే

సౌత్ ఈస్టర్న్ రైల్వే పరిధిలోని ఓ లోకల్ రైలులో ప్రయాణిస్తున్న వ్యక్తి తన పవర్ బ్యాంక్‌ను ఛార్జింగ్‌కు పెట్టగా అది ఒక్కసారిగా పేలిపోయింది.

దీంతో బోగీ మొత్తం దట్టమైన పొగ కమ్ముకోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన రైల్వే బోర్డు.. అక్టోబర్ 26న జారీ చేసిన లేఖలో రాత్రి వేళల్లో ఛార్జింగ్ పాయింట్లకు విద్యుత్ సరఫరా నిలిపివేసే నిబంధనను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించకూడదని స్పష్టం చేసింది.

ఈ విషయంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని హెచ్చరించింది.

వివరాలు 

అధికారులతో ఆకస్మిక తనిఖీలు

రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మెయిన్ స్విచ్‌బోర్డుల నుంచి ఛార్జింగ్ పాయింట్లకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారా లేదా అనే విషయాన్ని పరిశీలించేందుకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని రైల్వే బోర్డు అధికారులకు సూచించింది.

నిబంధనల అమలులో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఈ నిబంధనను రైల్వే శాఖ తొలిసారిగా 2014 జూన్ 19న అమల్లోకి తీసుకొచ్చింది.

బెంగళూరు-నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలులో జరిగిన ప్రమాదం తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది.

విద్యుత్ పరికరాలు వేడెక్కడం, అధిక విద్యుత్ వినియోగం, షార్ట్ సర్క్యూట్‌ల కారణంగా మంటలు చెలరేగే ప్రమాదాన్ని తగ్గించడమే దీని ప్రధాన ఉద్దేశం.

అనంతరం మార్చి 2021లో రైల్వే బోర్డు ఈ ఆదేశాలను మరోసారి పునరుద్ధరించింది.

ADVERTISEMENT

వివరాలు 

ప్రయాణికులకు రైల్వే శాఖ సూచనలు

రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రైళ్లలోని ఛార్జింగ్ పాయింట్లు పనిచేయవు.

అందువల్ల రాత్రివేళ ప్రయాణించేవారు రైలెక్కే ముందే తమ మొబైల్ ఫోన్లు, పవర్ బ్యాంకులు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పూర్తిగా ఛార్జ్ చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది.

ADVERTISEMENT