LOADING...
Rains: పల్నాడులో వర్షం బీభత్సం.. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు!
పల్నాడులో వర్షం బీభత్సం.. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు!

Rains: పల్నాడులో వర్షం బీభత్సం.. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 13, 2025
11:23 am

ఈ వార్తాకథనం ఏంటి

పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పెదకూరపాడు మండలం పరస-కాశీపాడు అడ్డరోడ్డు వద్ద కాలచక్ర రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో సత్తెనపల్లి-అమరావతి రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పెదకూరపాడు-అబ్బరాజుపాలెం గ్రామాల మధ్య శరవణా కోల్డ్ స్టోరేజ్ సమీపంలోని లోతట్టు వంతెన వద్ద బుధవారం తెల్లవారుజామున ప్రమాదం తృటిలో తప్పింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు ప్రవాహాన్ని అంచనా వేయక ముందుకు వెళ్ళగా, ఇద్దరు యువకులు కొట్టుకుపోయారు. పెదకూరపాడు ఎస్సై గిరిబాబు, తన సిబ్బందితో కలిసి ప్రవాహంలో కొట్టుకుపోతున్న సాగర్, సన్నీని సురక్షితంగా రక్షించారు.

Details

వాహన రాకపోకలకు అంతరాయం

కంభంపాడు-పరస గ్రామాల మధ్య నక్కల వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో పరస-గుంటూరు మార్గంలో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. పెదకూరపాడు మండలంలోని తాళ్లూరు, పాటిబండ్ల గ్రామాల లోతట్టు ఇళ్లలో వర్షపు నీరు చేరింది. జాలలుపురం, పాటిబండ్ల, కంభంపాడు, పరస గ్రామాల్లో పంట పొలాలు వరద నీటిలో మునిగిపోయాయి. క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో వాగు పొంగి పొర్లడంతో పిడుగురాళ్ల-క్రోసూరు రహదారి మూసివేయబడింది. అచ్చంపేట గ్రామం వర్షపు నీటితో చుట్టుముట్టబడటంతో సత్తెనపల్లి-అచ్చంపేట బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. అచ్చంపేట విద్యుత్ ఉపకేంద్రం, ఎన్ఎస్పీ భవనంలోకి కూడా వరద నీరు ప్రవేశించింది.

Details

నీటమునిగిన పంట పొలాలు

అమరావతి-గుంటూరు రహదారిలోని నరుకుల్లపాడు-యండ్రాయి వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో ఈ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎగువ నుంచి భారీగా చేరిన వరద నీటితో పంట పొలాలు మునిగిపోయాయి. అమరావతి మండలం పెద్ద మద్దూరు వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండగా, వంతెనపైకి నీరు చేరడంతో అమరావతి-విజయవాడ రహదారి రాకపోకలు కూడా నిలిచిపోయాయి.